logo

ఆసుపత్రులు కిటకిట

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.

Published : 02 Jul 2024 05:48 IST

పెరుగుతున్న విష జ్వరాలు, శ్వాసకోశ వ్యాధులు

మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో స్థలం లేక కారిడార్‌లో మంచాలు వేసి జ్వర పీడితులకు చికిత్స అందిస్తున్న దృశ్యం

  • సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)లో సాధారణ రోజుల్లో 750 మంది వరకు ఓపీ నిమిత్తం వస్తుంటారు. సోమవారం ఆ సంఖ్య 1100కు పైగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
  • నల్గొండ జీజీహెచ్‌లో సోమవారం వివిధ విభాగాల్లో ఓపీ సంఖ్య 684 ఉండగా.. గత వారం క్రితం ఇది 500 కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.

ఈనాడు, నల్గొండ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ లాంటి పట్టణాలతో పాటు పురపాలికల్లోని ప్రైవేటు, ఏరియా ఆసుపత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువైంది. ఎక్కువగా విషజ్వరాలతో పాటు దగ్గు, శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నట్లు వైద్యులు గుర్తించారు. డెంగీ, మలేరియాతో సైతం ప్రజలు విలవిలలాడుతున్నారు. దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి, ఆలేరు లాంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఏటా వర్షాకాలం ప్రారంభంలో పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ దఫా పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో నిర్వహణ అటకెక్కింది. ప్రత్యేకాధికారుల పాలన ఉన్నా.. పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో జ్వర పీడితులు పెరిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పులు చేసి పల్లెల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని, ఆరు నెలలుగా బిల్లులు మాత్రం రావడం లేదని పంచాయతీ కార్యదర్శులు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించడం గమనార్హం.

ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ

జ్వరపీడితుల సంఖ్య పెరగడంతో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ దందా నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడలో ఎక్కువగా ఉంది. సంబంధిత అధికారులు మాత్రం తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నల్గొండ మండలం చందనపల్లికి చెందిన మల్లేష్‌కు జ్వరం రావడంతో ఇటీవల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అది డెంగీ అని చెప్పి రూ.35 వేలకు పైగా బిల్లు కట్టించుకున్నారు. తీరా అది డెంగీ కాదు.. విషజ్వరం అని తేలడంతో రెండు రోజులు చికిత్స అందించి పంపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పడకల కొరత

రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పలు ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడుతోంది. ఉదాహరణకు దేవరకొండ లాంటి మారుమూల ప్రాంతాల్లో విషజ్వరాలు ఎక్కువగా ఉండటంతో సోమవారం ప్రాంతీయ ఆసుపత్రికి 600 మందికి పైగా ఓపీ సేవల కోసం బారులుతీరారు. సాధారణ రోజుల్లో 450కి మించదు. ఒక్కసారిగా రోగులు రావడంతో ఆసుపత్రిపై భారం పడింది. జిల్లా కేంద్రాలైన నల్గొండ, సూర్యాపేటల్లోని జీజీహెచ్‌లో రోగులకు చాలినన్నీ పడకలు ఉండగా.. ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల పీహెచ్‌సీలకు వైద్యులు సకాలంలో రావడం లేదు. దీంతో స్థానికంగానే తగ్గే జ్వరాలు.. వైద్యుల ఆలస్యంతో ఇన్‌పేషంట్‌ (ఐపీ)గా మారుతున్న పరిస్థితి తలెత్తుతోంది.

చర్యలు తీసుకుంటున్నాం

గతంలో కన్నా ఓపీ గణనీయంగా పెరిగిన మాట వాస్తవమే. దేవరకొండ, మిర్యాలగూడ లాంటి ప్రాంతాల్లో 100 పడకలకు 150 మంది రోగులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అందుబాటులో ఉన్న పడకలతో చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాం. దేవరకొండకు మరో వంద పడకలు అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. ఎంత మంది రోగులు వచ్చినా చికిత్స అందిస్తాం.

డాక్టర్‌ మాతృనాయక్, ప్రాంతీయ ఆసుపత్రుల సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్‌), నల్గొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని