logo

విద్యుత్తు అధికారులు రైతులను వేధించొద్దు: మంత్రి కోమటిరెడ్డి

విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల మార్పిడి వంటి ప్రతి పనికి¨ రైతుల నుంచి డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని విరమించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Published : 02 Jul 2024 05:46 IST

గంధవారిగూడెం పాఠశాలలో విద్యార్థినికి సైకిల్‌ పంపిణీ చేసి సాధన చేయిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల మార్పిడి వంటి ప్రతి పనికి¨ రైతుల నుంచి డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని విరమించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్గొండ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తు ఉన్నతాధికారులు ఉపకేంద్రాలు, ట్రాన్స్‌పార్మర్లు, లైన్ల షిఫ్టింగ్‌ వంటి వాటికి ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. మూడు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు సాగు నీరు తీసుకొస్తామన్నారు. గ్రామాల్లో తాగునీటికి సమస్య ఉండకూడదన్నారు. భవనాలు లేని అంగన్‌వాడీ కేంద్రాలకు 55 నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. నల్గొండ ఆర్టీసీ డిపోకు 20 ఏసీ బస్సులు కావాలని ఎండీ సజ్జనార్‌కు తెలిపామన్నారు. మల్కాపుర్‌ వరకు 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తామని తెలిపారు. నల్గొండ ఎంపీపీ సుమన్, జడ్‌పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య పాల్గొన్నారు.
పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం.. నల్గొండ జిల్లా పరిషత్తు: పేదలను ఆదుకోవడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని మున్సిపల్‌ పార్కులో సోమవారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. వైద్యం, ఆర్థిక పరమైన బాధితులకు సహాయాన్ని అందించారు.

విద్యార్థులు కష్టపడి చదవండి

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్గొండలోని గంధవారిగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ గురుకుల పాఠశాల రాష్ట్రంలోనే అన్నింటిలో ముందుండాలన్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలకు 20 సైకిళ్లు అందచేశారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడారు. ప్రిన్సిపల్‌ లలితకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, పుర ఛైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌సీవో అరుణకుమారి పాల్గొన్నారు

సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మేలు.. నల్గొండ గ్రామీణం: సహకార వ్యవస్థ ద్వారా రైతులకు ప్రభుత్వం మేలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నల్గొండ డీసీసీబీ ద్వారా  రూ.2,332 కోట్లు వ్యాపారం జరుగుతుందని తెలిపారు. దీనిని ఈ ఏడాది చివరి నాటికి రూ.3 వేల కోట్లకు తీసుకొస్తామన్నారు. నల్గొండ డీసీసీబీలో నూతనంగా ఛైర్మన్‌ బాధ్యతలు తీసుకున్న కుంభం శ్రీనివాసరెడ్డిని బ్యాంకులో మంత్రి సన్మానించారు. రుణ మాఫీ రూ. 2 లక్షలు ఏక కాలంలో చేస్తామని వివరించారు. ఈ ప్రక్రియ 15 రోజుల్లో  మొదలవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంటుందని.. రుణాలు సహకార రంగం ద్వారా తీసుకోవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని