logo

మెరుగైన విద్యుత్తు సరఫరాకు సర్వే

పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన కరెంటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 02 Jul 2024 05:45 IST

తొలుత మూడు జిల్లా కేంద్రాల్లో నిర్వహణ

క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న విద్యుత్తు సిబ్బంది

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన కరెంటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లో విద్యుత్తు వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకొని బలోపేతం చేసే దిశగా అడుగుల వేస్తోంది. అందుకు ప్రత్యేకంగా శాటిలైట్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది. తొలుత జిల్లా కేంద్రాల్లో 33 కేవీ, 11 కేవీ, ఎల్‌టీ లైన్ల వారీగా స్తంభాలను(పోల్‌ టూ పోల్‌) సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని జిల్లా కేంద్రాలైన నల్గొండ, సూర్యాపేట, భువనగిరి పట్టణాల్లో అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి శాటిలైట్‌ సర్వే చేపట్టారు. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తున్నారు.

యాప్‌లో నిక్షిప్తం

సబ్‌స్టేషన్‌ పేరు, ఫీడరు, కేటగిరి లైను, విద్యుత్తు నియంత్రిక సామర్థ్యం, కరెంటు ప్రత్యేక నంబరు వేయడంతోపాటు, స్తంభాల మధ్య దూరం, వాటి లొకేషన్, స్తంభం సామర్థ్యం, కాసారం, తీగ పరిమాణం, ఇన్సూలేషన్‌ రకం వంటి వివరాలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. స్తంభం ఫొటోను అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు ఇలా..

ప్రయోజనాలు ఇవీ..

విద్యుత్తు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోంది. దీని ద్వారా సేకరించిన వివరాలతో భవిష్యత్తులో కరెంటు సమస్యలు ఉత్పన్నం కావు. పట్టణాల్లో విద్యుత్తు ఏర్పాటయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని స్తంభాలు వేశారు, వాటి పటిష్ఠత, లైన్ల పనితీరు, ఏ సబ్‌స్టేషన్‌ పరిధిలో ఎన్ని స్తంభాలు, నియంత్రికలెన్ని ఉన్నాయి.. ఇలాంటి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీటిని ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌ కార్పొరేట్‌ కార్యాలయం నుంచే ఉన్నతాధికారులు చూసి, ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థ పనితీరును పర్యవేక్షించే అవకాశం ఉంది. ఏటా లైన్లు, స్తంభాలు, నియంత్రికల నిర్వహణకు ఎన్ని నిధులు వెచ్చించాలో అంచనా వేయొచ్చు. పట్టణాల్లో విజయవంతమైతే గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రత్యేక సర్వే నిర్వహిస్తామని సంస్థ అధికారులు చెబుతున్నారు.

సమస్యలకు సత్వర పరిష్కారం

- చంద్రమోహన్, ఎస్‌ఈ, నల్గొండ జిల్లా

ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలుత జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సర్వే చేపట్టాం. కచ్చితమైన వివరాలు తెలియడంతో నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకాలకు ఇబ్బందులు ఉండవు. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పరిష్కరించడం వల్ల సమయం ఆదా కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని