logo

యువతిపై అత్యాచారం.. దోషికి తుదిశ్వాస వరకు కారాగారం

ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి ఓ యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ‘జీవిత కాలం శిక్ష’ (తుది శ్వాస వదిలే వరకు), రూ.21,000 జరిమానా విధించింది.

Published : 02 Jul 2024 05:43 IST

వంశీకృష్ణ

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి ఓ యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ‘జీవిత కాలం శిక్ష’ (తుది శ్వాస వదిలే వరకు), రూ.21,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సునీత బర్ల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామానికి చెందిన ఇంద్రకంటి వంశీకృష్ణ అలియాస్‌ బబ్లూ (19) హయత్‌నగర్‌ పరిధిలోని శాంతినగర్‌లో ఉంటూ మెకానిక్‌గా పనిచేసేవాడు. ప్రేమిస్తున్నానంటూ ఇంటర్‌ చదివే ఓ యువతి (17) వెంట పడేవాడు. 2017 డిసెంబరు 10న బంధువుల ఇంటికెళ్లి ఆటోలో తిరిగొస్తున్న యువతిని.. మార్గమధ్యలో ఆపి.. ఇంటి వద్ద దింపుతానని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని.. తన ఇంటికి తీసుకెళ్లి రెండ్రోజులు నిర్భందించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ మేరకు హయత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. బాధితురాలికి సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజిస్ట్రేట్‌ పర్యవేక్షణలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. దర్యాప్తు తర్వాత నిందితుడిపై భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి సోమవారం తుది తీర్పు వెల్లడించారు. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని