logo

శిథిల భవనాల్లో పల్లె పాలన

పరిపాలన సౌలభ్యం కోసం సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటికి మాత్రమే భవన నిర్మాణానికి కొంత నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు.

Published : 02 Jul 2024 05:38 IST

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరగా.. దాని పక్కనే రెండేళ్ల కిందట నూతన భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. కొద్దిమేర పిల్లర్లు వేసి పునాది దశలో వివిధ కారణాలతో పనులు నిలిపివేశారు. దీంతో శిథిలమైన, వానలకు ఉరుస్తున్న భవనంలోనే పాలన సాగుతోంది. సభలు, సమావేశాల సమయంలో వీధిలో టెంట్లు వేసి కార్యక్రమాలు జరుపుతున్నారు.

తుంగతుర్తి, న్యూస్‌టుడే: పరిపాలన సౌలభ్యం కోసం సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటికి మాత్రమే భవన నిర్మాణానికి కొంత నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు. నిధుల కొరతతో అవి అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొత్త పంచాయతీలకు సొంత భవనాలు లేక అధికారులు, పాలకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో కమ్యూనిటీ, అద్దె భవనాలు, పాఠశాలల్లోని కొన్ని గదుల్లో పల్లె పాలన నిర్వహిస్తున్నారు.

అసంపూర్తిగా నిర్మాణాలు

మొదట్లో జిల్లాలో మొత్తం 301 గ్రామ పంచాయతీలు ఉండగా.. గత ప్రభుత్వం 500 జనాభా ఉన్న తండాలు, ఆవాసాలను పంచాయతీలుగా మార్చింది. దీంతో 174 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 127 పంచాయతీల్లో భవనాలు నిర్మించడానికి అనుమతులు వచ్చాయి. ఒక్కో దానికి రూ.20 లక్షల నిధులు కేటాయించారు. అవి సరిపోక చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో పాఠశాలలు, ఇతర అద్దె భవనాల్లో పాలనను కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. అవి శిథిలావస్థకు చేరుకోగా.. వర్షాలు కురిస్తే మరింతగా దెబ్బతినే అవకాశం ఉంది.

తుంగతుర్తి మండలంలోని రావులపల్లి క్రాస్‌రోడ్డు తండాను గత ప్రభుత్వ హయాంలో నూతన పంచాయతీగా మార్చారు. సొంత భవనం నిర్మించలేదు. తండాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిని పంచాయతీ కార్యాలయానికి అధికారులు అప్పగించటంతో అందులోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థులు గదుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం: సురేష్, జిల్లా పంచాయతీ అధికారి

జిల్లాలో శిథిలావస్థకు చేరిన, అద్దె భవనాల్లో కొనసాగుతున్న, నూతన పంచాయతీ భవనాలను పరిశీలిస్తాం. అసంపూర్తిగా ఉన్న వాటి గురించి ఉపాధిహామీ అధికారులతో మాట్లాడి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. శిథిల భవనాలను తొలగింపజేసి కొత్త వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని