logo

ఫీజులు నొక్కి.. ఇరుకు గదుల్లో కుక్కి

జిల్లాలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్‌ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.

Updated : 02 Jul 2024 06:19 IST

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్‌ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులకు తగిన విధంగా వసతులు కల్పించాల్సి ఉన్నా అవేవి పాటించకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. కళాశాలలో చేరిన తర్వాత అధిక ఫీజుల వసూళ్లపై ప్రశ్నించిన విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ప్రవేశాలు పొందిన దగ్గరి నుంచి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ధ్రువపత్రాలు తీసుకునే వరకు కళాశాలలో చేరినప్పుడు మాట్లాడుకున్న దానికి కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు.

వసతులు గగనమే!

జిల్లాలో గతేడాది 32 ప్రైవేటు కళాశాలలు ఉండగా.. ప్రస్తుతం 26 ఉన్నాయి. ఇంకా మూడింటికి అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,589 మంది విద్యనభ్యసిస్తున్నారు. మొదటి సంవత్సరంలో చేరికలపై యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నాయి. భోజనం, వసతి గృహాల్లో మొదట చేర్చుకునే వరకు ఒకలా... చేరిన కొద్ది రోజుల తర్వాత మరోలా వసతులు కల్పిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇరుకైన వసతి, తరగతి గదుల్లో ఎక్కువ మందిని ఉంచుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. చాలా వసతి గృహాల్లో నిబంధనలను విస్మరిస్తున్నారు. ఫైర్‌ సేఫ్టీ, ఆటస్థలాలు, క్రీడలు, తదితర వసతులు కల్పించకున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతు    న్నాయి. ఒక పెద్ద భవనాన్ని అద్దెకు తీసుకుని అందులోనే తరగతులు, వసతి, భోజనశాల, ఆఫీస్‌ రూం వంటి అన్నింటినీ నిర్వహిస్తుండటం గమనార్హం.

వసూలు ఇలా..

ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశ రుసుం రూ.500, ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో పరీక్ష ఫీజు రూ.1500 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తున్నారు. డేస్కాలర్‌కు ప్రథమ సంవత్సరం రూ.5 వేల నుంచి రూ.7 వేలు, ద్వితీయ సంవత్సరం రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు. వసతి గృహాలతో కలిపి రూ.35 వేల నుంచి రూ.55 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటికితోడు పుస్తకాలు, ధోబీ, ఇతర ఫీజులు అదనంగా చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

- కృష్ణయ్య, డీఐఈవో, సూర్యాపేట

ప్రైవేటు కళాశాలల్లో వసతులు కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఫీజుల విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. యాజమాన్యాలే నచ్చిన విధంగా ఫీజు నిర్ధారించుకున్నారు. పరీక్ష రుసుం అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. కళాశాలల్లో తగిన వసతులు లేకుంటేే అనుమతులు రద్దు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని