logo

బిందుసేద్యం విస్తరణకు అడుగులు

సాగునీటి సమస్య.. మరోపక్క కూలీల కొరత వెరసి వ్యవసాయం అనుబంధ సాగుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

Published : 02 Jul 2024 05:35 IST

నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో సంతోషం

కొత్తజాల గ్రామంలో బిందుసేద్యం పద్ధతిలో బీరతోట సాగు..

రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: సాగునీటి సమస్య.. మరోపక్క కూలీల కొరత వెరసి వ్యవసాయం అనుబంధ సాగుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండటం, అధిక నీటి వినియోగం, ఏటికేడు దిగుబడి తగ్గుతుండటం వంటి పరిస్థితులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలను కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిందు, తుంపర సేద్యం ద్వారా అధికాదాయం పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది. డ్రిప్‌ సాగును విస్తరింపజేయాలని వ్యవసాయశాఖ అధికారులకు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించడంతో ఈ వానాకాలం నుంచే అమలుకు చర్యలు తీసుకుంటున్నారు.  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ 5,000 ఎకరాలు, 2,246 ఎకరాల్లో పండ్లు, కూరగాయల సాగును బిందుసేద్యం ద్వారా చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ప్రోత్సహించే పంటలు

ప్రధాన పంటలైన పత్తి, మొక్కజొన్న, మామిడి, జామ, బత్తాయి, మిరప, దానిమ్మ, అయిల్‌పామ్, కూరగాయల పంటలు, పూల సాగుకు డ్రిప్‌ విధానం అమలు కానుంది. నల్గొండ జిల్లాలో 3,940, సూర్యాపేట 1,808, యాదాద్రి భువనగిరి 1,498 ఎకరాల్లో బిందుసేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాయితీలు ఇలా..

ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తిగా ఉచితంగా అంటే 100 శాతం రాయితీపై డ్రిప్‌ పరికరాలను ప్రభుత్వం అందిస్తుంది. బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ వర్తిస్తుంది. పంటల సాగును బట్టి ఒక్కో యూనిట్‌ ధర ప్రతి హెక్టారుకు రూ.33,500 నుంచి రూ.1,44,000 వరకు రాయితీ అందుతుంది. ఇప్పటి వరకు డ్రిప్‌ పరికరాలకు రైతులు వందల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నట్లుగా ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. బిందుసేద్యం ద్వారా 50 శాతం నీటి ఆదాతో పాటు ఎరువులు, కూలీల ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆసక్తి కలిగిన రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తులో ఏ పంట సాగు చేస్తారో అనే విషయం తెలిపాల్సి ఉంటుంది.

దరఖాస్తులు స్వీకరిస్తున్నాం

- అన్నపూర్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి, యాదాద్రి భువనగిరి

సూక్ష్మసేద్యం వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. బిందుసేద్యంపై కర్షకుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని