logo

గర్భిణి మృతికి కారణమైన ఆరుగురి అరెస్టు

చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన ఎనిమిది నెలల గర్భిణి సుహాసిని మృతి కేసులో ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు.

Published : 02 Jul 2024 05:34 IST

సూర్యాపేటలో నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్, చిత్రంలో డీఎస్పీ రవి, తదితరులు

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన ఎనిమిది నెలల గర్భిణి సుహాసిని మృతి కేసులో ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం బట్టుతండాకు చెందిన బట్టు కృష్ణ, క్రాంతి దంపతుల కుమార్తె సుహాసిని(27)ని చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన రత్నావత్‌ హరిసింగ్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఆడపిల్లలు జస్విక(4), అన్విక(2) జన్మించిన తర్వాత సుహాసిని ఆపరేషన్‌ చేయించుకుంటానంటే ఆమె భర్త హరిసింగ్, బంధువులు కలిసి వారసుడు(కుమారుడు) కావాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. మగ పిల్లవాడు లేకపోతే మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించి బలవంతం చేయడంతో సుహాసిని భయంతో కు.ని. చేయించుకోలేదు. అనంతరం గర్భం దాల్చడంతో వారందరూ కలిసి స్కానింగ్‌ చేయించుకొమ్మని బలవంతంగా ఆటోలో కోదాడలోని డాక్టర్‌ గురవయ్య ఆసుపత్రికి రెండు నెలలుగా నాలుగుసార్లు తీసుకెళ్లి స్కానింగ్‌ చేయించారు. చివరి సారి గర్భంలో ఆడపిల్ల ఉందని వైద్యులు నిర్ధారించారు. ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు కలిసి సుహాసినిని గర్భవిచ్ఛిత్తి చేయించుకొమ్మని బలవంతం చేశారు. గత నెల 24న హుజూర్‌నగర్‌లోని న్యూ కమలా ఆసుపత్రికి తీసుకెళ్లి దవాఖానా మేనేజర్‌ ఖాసీంతో అబార్షన్‌ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

నర్సు దేవరకొండ రాణితో గర్భవిచ్ఛిత్తిని ప్రారంభించారు. మరుసటి రోజు ఖాసీం సుహాసినిని పెద్దవీడు గ్రామానికి తీసుకెళ్లి అక్కడ అతని ఇంట్లో ఉంచి, నర్సు రాణిని అక్కడికి పిలిపించి మరోసారి అబార్షన్‌ టాబ్లెట్స్, ఇంజెక్షన్లు ఇచ్చారు. రక్తస్త్రావం అవుతూ అబార్షన్‌ కావట్లేదని గుర్తించి ఆమెతోపాటు భర్తను ఖాసీం కారులో మఠంపల్లికి తర్వాత కోదాడకు తీసుకెళ్లి డాక్టర్‌ గురువయ్య ఆసుపత్రిలో చేర్పించారు. 26న ఉదయం డాక్టర్‌ స్కానింగ్‌ నిర్వహించి, ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పాడు. అక్కడి నుంచి ఖమ్మం, తర్వాత హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో సూర్యాపేటలో మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చివ్వెంల ఠాణాలో పీఎన్‌డీటీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశారు. మృతురాలి భర్త హరిసింగ్, న్యూ కమలా ఆసుపత్రి మేనేజర్‌ షేక్‌ ఖాసీం, నర్సు దేవరకొండ రాణి, కోదాడలోని విజయ ఆసుపత్రి కంపౌండర్లు రణపంగు గోపి, షేక్‌ సైదులు, తాళ్లమల్కాపురానికి చెందిన అమరగాని నవీన్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. గర్భవిచ్ఛిత్తికి సహకరించిన మరికొంత మందిని అరెస్టు చేస్తామన్నారు. డాక్టర్‌ గురువయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని