logo

ఒత్తిడిని జయిద్దాం..హాయిగా జీవిద్దాం

ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి.

Updated : 02 Jul 2024 06:20 IST

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి. చిన్నారులు, విద్యార్థులు చదువుల్లో, యువతలో ప్రేమ, స్నేహం, ఉద్యోగం, అనుకున్నది సాధించలేకపోవడం వంటి వాటితో.. పెద్దవారిలో పిల్లల భవిష్యత్తుతో పాటు ఆర్థిక పరిస్థితుల కారణంగా తీవ్ర ఆందోళనకు గురవుతూ అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ అనేక మంది ఒత్తిడితో అనారోగ్యం బారిన పడడంతో పాటు ఆత్మహత్యలు వంటి చర్యలకు సైతం పాల్పడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో యువతే అధికం..

ఉమ్మడి జిల్లాలో సుమారు ఆరు లక్షల మంది యువత ఉన్నారు. వీరిలో జూనియర్‌ కళాశాల విద్యార్థులు సుమారు 12 వేల మంది ఉండగా.. 18-19 ఏళ్ల వయసున్న వారు 65 వేల మంది ఉన్నారు. వీరిలో అనేక మంది చదువుతో పాటు ఆర్థిక, ప్రేమ వ్యవహారాల వల్ల తీవ్ర ఒత్తిడి బారిన పడుతున్నారు. దీంతో మద్యం, మత్తు పదార్థాలకు వ్యసనపరులవుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల గంజాయి రవాణా, వినియోగంలో పట్టుబడుతున్న వారిలో 99 శాతం మంది యువతే ఉండడం గమనార్హం. తమలోని ఒత్తిడిని తగ్గించుకునేందుకు గంజాయి వాడుతూ.. అనంతరం ఆర్థిక పరిస్థితులతో ఇతరులకూ విక్రయిస్తున్నారు.

గత సంఘటనలు..

  • మేళ్లచెరువులో అప్పులతో ఒత్తిడికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. ఆర్నెళ్ల వ్యవధిలో అతడి భార్య సైతం బలవన్మరణానికి పాల్పడింది.
  • క్రికెట్‌ బెట్టింగ్‌కు అలవాటు పడి మేళ్లచెరువు మండలం రేవూరుకు చెందిన ఓ యువకుడు దొంగతనానికి సైతం పాల్పడి..ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
  • హుజూర్‌నగర్‌కు చెందిన యువకుడు భార్య తరఫు వారి వేధింపులు తాళలేక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
  • 2023లో హైదరాబాద్‌ రామాంతపూర్‌లో ప్రేమించిన యువతితో వివాహం జరగకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వచ్చే అనారోగ్య సమస్యలివి..

ముఖ్యంగా గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, అజీర్తి, శ్వాస వంటి అనారోగ్య సమస్యలు ఒత్తిడి, ఆందోళన వల్లనే వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి కారణంగా మూర్చవ్యాధి సైతం వచ్చే అవకాశాలున్నాయి. ఇవి మెదడుపై తీవ్ర ప్రభావం చూపి ఆత్మహత్యలు, హత్యలు వంటి ఆలోచనలకు దారి తీస్తాయి.

చిట్కాలు...

  • నచ్చిన ఆహారం తినాలి.
  • నడకతో మనసు, మెదడు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గుతుంది.
  • నచ్చిన ప్రదేశాన్ని, వ్యక్తులను ఊహించుకోవాలి.
  • మంచి సంగీతాన్ని వినాలి.

చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ నేర్పించాలి: డాక్టర్‌ భవాని, మానసిక నిపుణులు, మిర్యాలగూడ

చిన్నప్పటి నుంచి పిల్లలకు ఏది అడిగితే అది వెంటనే ఇవ్వకుండా ప్రయత్నిస్తే సాధించగలమనే ఆలోచనతో పాటు క్రమశిక్షణను అలవాటు చేయాలి. పరీక్షల సమయంలోనే కాకుండా ఒక ప్రణాళికతో చదివేలా ప్రోత్సహించాలి. పిల్లలను ఆటలు ఆడించడంతో గెలుపోటములు సహజమనే విషయాన్ని గ్రహించి యుక్త వయస్సు తర్వాత పరీక్షల్లో ఉత్తీర్ణత, ఉద్యోగం రాకపోయినా, ప్రేమ విఫలమైనా ఒత్తిడికి గురి కాకుండా తట్టుకుని నిలబడే స్వభావం అలవడుతుంది. ఆటలు, యోగా, డ్రాయింగ్, స్నేహం వంటివి అలవాటు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని