logo

ప్రతిభ చూపితే.. భవిత మీదే!

మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగొచ్చు కానీ.. వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు.

Updated : 02 Jul 2024 06:21 IST

రాజపేట, ఆలేరు, న్యూస్‌టుడే: మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగొచ్చు కానీ.. వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగాల వైపు మరల్చడమే లక్ష్యంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ పరిధిలోని విజ్ఞాన భారతి, విజ్ఞాన్‌ ప్రసాద్, ఎన్‌సీఈఆర్టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌ రీసెర్చ్‌ ట్రైనింగ్‌) సంయుక్తంగా ‘విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌’ (వీవీఎం) పేరిట ఏటా ప్రతిభా పరీక్షలు చేపడుతోంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయమై ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువుతున్న విద్యార్థులను విద్యాశాఖ వర్గాలు ఇప్పటి నుంచే అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి సుమారు మూడు వేలకు పైగా పాఠశాలలుండగా సుమారు 2.60 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అందులో కొద్దిమందికైనా ఇందులో స్థానం లభిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నది కొందరి విద్యా నిపుణుల అభిప్రాయం.

దరఖాస్తు విధానం ఇలా..

ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.200 రుసుం చెల్లించి ‘విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌’ అనే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకు సెప్టెంబరు వరకు గడువు ఉంది. నమోదు చేసుకున్న వారికి జూనియర్, సీనియర్‌ విభాగాల్లో ప్రకటించిన తేదీల్లో పరీక్షలుంటాయి. తెలుగు, ఆంగ్లం, హిందీతో పాటు ఇతర దేశ భాషల్లోనూ పాల్గొనవచ్చు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉంటాయి. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇప్పటికే వెబ్‌సైట్‌లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. అక్టోబరు 23, 27న (వీలును బట్టి ఏదైనా తేదీల్లో) జిల్లా స్థాయి పరీక్ష ఉంటుంది. నవంబరు 15న ఫలితాలు విడుదల చేస్తారు. డిసెంబరు 8, 15, 22 తేదీల్లో ఒక రోజు రాష్ట్ర స్థాయి పోటీలుంటాయి. 2025 మే 17 లేదా 18 తేదీల్లో జాతీయ స్థాయి పరీక్ష ఉంటుంది.

విజేతలకు నగదు పురస్కారం

పాఠశాల స్థాయి పోటీల్లో 18 మంది చొప్పున ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి పోటీలకు సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి ఆన్‌లైన్‌ ప్రశంసా ధ్రువపత్రాన్ని అందిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 20 మందిని ఎంపిక చేస్తారు. వీరికి ధ్రువపత్రంతో పాటు జ్ఞాపిక, రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున నగదు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపితే రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10వేల చొప్పున అందిస్తారు. భాస్కర స్కాలర్‌షిప్‌ పేరుతో ఏడాది పాటు నెలకు రూ.2 వేల చొప్పున సదరు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించే అవకాశం ఉంటుంది.

పరీక్షలో అంశాల వివరాలు..  

  • వంద బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.
  • సామాన్య, గణితం, పాఠ్యపుస్తకాల్లోని అంశాలు: 90 శాతం
  • విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతదేశ కృషిపై: 20 శాతం
  • శాస్త్రవేత్తల జీవిత విశేషాలపై..: 20 శాతం మార్కులుంటాయి. వీటిని వీవీఎంఏ వారు అందించే స్టడీ మెటీరియల్‌ ద్వారా ఇస్తారు.
  • లాజిక్, రీజనింగ్‌కు: 10 శాతం మార్కులుంటాయి. వీటిని సమకాలీన అంశాలపై ఇస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి

- సీహెచ్‌.భరణికుమార్, జిల్లా సైన్స్‌ అధికారి, యాదాద్రి భువనగిరి

పాఠ్యపుస్తకాలతో పాటు సామాజిక అంశాలు, చరిత్రపై పట్టున్న విద్యార్థులు ‘విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌’ ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేందుకు అవకాశం ఉంటుంది. జిల్లా విద్యాధికారి నారాయణరెడ్డి సూచనల మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందించి ఎక్కువ మంది పోటీలో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని