logo

అమాత్య యోగం ఎవరికో..?

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది. ఈనెల తొలి వారంలోనే పలు మంత్రి పదవులను భర్తీ చేస్తామనే సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో.. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికీ అమాత్యయోగం దక్కనుందనే చర్చ సాగుతోంది.

Published : 01 Jul 2024 04:50 IST

ఈనాడు, నల్గొండ

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది. ఈనెల తొలి వారంలోనే పలు మంత్రి పదవులను భర్తీ చేస్తామనే సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో.. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికీ అమాత్యయోగం దక్కనుందనే చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్‌ ఎమ్మెల్యే బాలునాయక్‌ మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పార్టీ ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలో చేరే సమయంలోనే తనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చారని.. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో భువనగిరి లోక్‌సభ సమన్వయకర్తగా నియమించినప్పుడూ మరోసారి భరోసా ఇచ్చారని సన్నిహితుల వద్ద రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆయన పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ద్వారా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాలునాయక్‌ సీనియర్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఎస్టీ కోటాలో ఇప్పటివరకు రాష్ట్రంలో మంత్రి పదవి లేకపోవడంతో.. పార్టీకి విధేయుడైన తనకు పదవి ఇవ్వాలని జానారెడ్డి ద్వారా అధిష్ఠానానికి ఆయన విన్నవించినట్లు తెలిసింది.

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొత్తగా రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి కేటాయిస్తే ఎదురయ్యే పరిణామాలను ఉమ్మడి జిల్లాలోని సీనియర్‌ నేతల ద్వారా అధిష్ఠానం ఆరా తీసినట్లు తెలిసింది. పీసీసీ పదవీ కూడా మంత్రి పదవుల సమయంలోనే భర్తీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో పీసీసీ పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించకపోతే బాలునాయక్‌కు అవకాశాలు ఉంటాయని సీనియర్‌ నాయకుడొకరు ‘ఈనాడు’తో అభిప్రాయపడ్డారు.

నేనావత్‌ బాలునాయక్‌, దేవరకొండ ఎమ్మెల్యే

నియమిత పదవులు సైతం..

మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం అయిన వెంటనే గత ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులతో పాటూ ఇటీవలి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో టిక్కెట్‌ ఆశించి వివిధ కారణాల వల్ల అవకాశం రాని వారిని నియమిత పదవులతో పార్టీ సత్కరించనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నాయకులకు పలు కార్పొరేషన్‌ ఛైర్మన్‌లుగా ప్రభుత్వం నియమించింది. కొంత మంది ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టడంతో పాటూ రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు కొన్ని ఉమ్మడి జిల్లాకు దక్కనున్నాయి. భారాస హయాంలో ఉమ్మడి జిల్లా నుంచి సుమారు ఎనిమిది మంది నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవులు దక్కాయి. త్వరలో జరగనున్న నియామకాల్లో ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు నల్గొండ, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, వెంకన్నయాదవ్‌ పదవీకాలం సైతం త్వరలోనే ముగియనుండటంతో వారు తమకు రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రి పదవుల కేటాయింపు అనంతరమే కార్పొరేషన్‌ పదవుల విషయంలో స్పష్టత రానుందని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని