logo

నేటి నుంచి అమల్లోకి పోలీస్‌ కొత్త చట్టాలు

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్‌ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి.

Published : 01 Jul 2024 04:44 IST

జిల్లాలో పోలీసులకు ముగిసిన శిక్షణ

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్‌ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి. అందులో భాగంగా జిల్లాలో పోలీస్‌ చట్టాలపై శిక్షణ ముగింపు సమావేశంలో ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్‌ అధికారి, సిబ్బందికి విడతల వారీగా చట్టాలపై శిక్షణ ముగిసినట్లు తెలిపారు. కొత్త చట్టాలైన సీఆర్‌పీసీకి బదులుగా భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), రెండోది ఐపీసీ బదులుగా (బీఎన్‌ఎస్‌) భారతీయ న్యాయ సంహిత, మూడోది ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్టు (ఐఈఏ)కు బదులుగా భారతీయ సాక్ష్యా అధినియం (బీఎస్‌ఏ)గా 2023 డిసెంబర్‌ 25న పార్లమెంటులో కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ చట్టాలు సోమవారం నుంచి పూర్తి స్థాయిల్లో జిల్లాలో కూడా అమల్లోకి రానున్నాయి. నూతన చట్టాలపై జిల్లాలో కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ స్థాయి వరకు 875 మందికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఒక్కో అధికారికి మూడు రోజుల చొప్పున రోజుకు 120 నుంచి 130 మందికి 18 బ్యాచ్‌ల్లో అవగాహన కల్పించారు.

కొత్త చట్టాల్లో కొన్ని ఇలా...

  • కోర్టు ఎవిడెన్స్‌ ఇచ్చే వారిలో.. పోలీస్, వైద్యులు, తహసీల్దార్‌ లాంటి అధికారులు విధులు నిర్వర్తిస్తూనే వీడియో కాల్‌ ద్వారా న్యాయమూర్తికి సాక్ష్యం చెప్పొచ్చు.
  • సెక్షన్‌ 103(2) ఐదురుగు అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేస్తే మాబ్‌లించింగ్‌ (కులం, మతం, స్థానం)గా గుర్తించారు.
  • చైౖన్‌ స్నాచింగ్‌ కోసం ప్రత్యేకంగా సెక్షన్‌ 304 బీఎన్‌ఎస్‌ తీసుకొచ్చారు.
  • యాసిడ్‌ దాడికి కొత్తగా సెక్షన్‌ 124 (బీఎన్‌ఎస్‌) అమల్లోకి తెచ్చారు.
  • పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం, లైంగికంగా వేధించే వారి కోసం కొత్తగా సెక్షన్‌ 69ని అమల్లోకి తీసుకొచ్చారు.
  • మైనర్‌ (18 ఏళ్లలోపు) పేరును మారుస్తూ చైల్డ్‌గా గుర్తింపు తీసుకొచ్చారు.
  • కొన్ని చీటింగ్‌ కేసుల్లో పట్టుబడిన నగదు కోర్టుకు మాత్రమే అనుసంధానం చేసేవారు.. కొత్తగా వచ్చిన చట్టంలో పట్టుబడిన నగదు కోర్టుకు అనుసంధానం చేయడంతో బాధితులకు పంచే వెసులుబాటు జిల్లా కలెక్టర్‌కు ఇచ్చారు.
  • తాజా చట్టాల్లో కొన్నింటికి శిక్షలు పెంచడంతో పాటు జరిమానాలు పెంచడం జరిగింది. ఉదాహరణకు ఒక వ్యక్తి చెయ్యి విరగొడితే గతంలో మూడేళ్ల జైలు రూ.1,000 జరిమానా.. ప్రస్తుతం రూ.20 వేలు జరిమానాకు పెరిగింది.  
  • కొత్తగా టెర్రరిస్టు చట్టం 113 అమల్లోకి తీసుకొచ్చారు.

మార్పులు..

  • గతంలో సీఆర్‌పీసీలో 484 సెక్షన్‌లు ఉండగా బీఎన్‌ఎస్‌ఎస్‌లో 531కి పెంచారు.
  • ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా బీఎన్‌ఎస్‌లో 358కి తగ్గించారు.
  • ఐఈఏలో 167 సెక్షన్లు ఉండగా బీఎస్‌ఏలో 170 పెరిగాయి.
  • ప్రస్తుత కాలానికి సాంకేతిక విభాగానికి ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత స్టేషన్‌కు వెళ్లలేని పక్షంలో ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు. వాట్సాప్, మెయిల్, ఎక్స్, ఫేస్‌బుక్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు, కానీ, మూడు రోజుల్లో సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో సంతకాలు చేయాలి. కేసుల విషయంలో కోర్టుకు హాజరు కాలేని సాక్షులను వీడియో కాల్‌ ద్వారా కూడా విచారించొచ్చు.

ప్రజల్లో అవగాహన పెరగాలి

శరత్‌ చంద్ర పవార్, ఎస్పీ

నూతనంగా వచ్చిన చట్టాలను సోమవారం నుంచి జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో అమలు చేస్తాం. మారిన చట్టాలపై ఇప్పటికే పోలీస్‌ అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయిల్లో శిక్షణ ఇచ్చాం. ప్రజల్లో కూడా నూతన చట్టాలపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. కొన్ని చట్టాల్లో వచ్చిన మార్పుతో నేరస్థులకు తక్షణ శిక్షలు పడటంతో పాటు, జరిమానాలు కూడా పెరిగాయి. వీటి ద్వారా దుండగులు నేరాలు చేయాలనే ఆలోచన వచ్చినా వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని