logo

స్పౌజ్‌ బదిలీల్లో అక్రమాలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి.

Updated : 01 Jul 2024 05:53 IST

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. అన్యాయం జరిగిందని డీఈవో దృష్టికి తీసుకెళ్లినా వెంటనే పరిష్కరించడం లేదన్న వాదన ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఫిర్యాదు చేసినప్పుడు వాటిని పరిశీలించి త్వరితగతిన జరిగిన తప్పులు సరిదిద్దాల్సి ఉన్నా చేయకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిబంధనల ప్రకారం చేస్తున్నామని అంటున్నా బదిలీల ప్రక్రియలో అక్కడక్కడ అర్హత ఉన్న వారికి అన్యాయం జరుగుతోంది. స్పౌజ్‌ కేటగిరిలో కొంత మంది అర్హత ఉన్న ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోంది. దీనిపై స్పౌజ్‌ పాయింట్లు తీసుకునే వారు స్పౌజ్‌ పాయింట్ల రేడియస్‌లోనే బదిలీలకు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఖాళీలు లేకపోతే పక్క మండలాలు, ఆ తరువాత మండలాలను ఎంపిక చేసుకోవచ్చు. అలా కాకుండా తమకు ఇష్టం ఉన్న మండలాలకు వెళ్లేలా ఆప్షన్‌లు ఇవ్వడం, అధికారులు పరిశీలించకుండానే ఆర్డర్‌లు ఇవ్వడంతో అసలు స్పౌజ్‌ పాయింట్ల నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి.

లోటుపాట్లు ఇలా.. స్పౌజ్‌ పాయింట్లకు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ బదిలీల్లో కట్టంగూరు మండలం కరుమర్తి పాఠశాల నుంచి స్పౌజ్‌ జాబితాలో దగ్గరలో ఉన్నా అదే మండలంలోని తక్కువ దూరంలో ఉన్న ఈదులూరు, కట్టంగూరు, అయిటిపాముల, పరడ, బొల్లేపల్లి తదితర ప్రాంతాలకు బదిలీ కావాలి. అలా కాకుండా ఆ మండలం దాటి దూరంలో ఉన్న తిప్పర్తి మండలానికి బదిలీ అయ్యారు. కట్టంగూరు మండలానికి చెందిన ముగ్గురిలో ఇద్దరు తిప్పర్తికి, మరొకరు నల్గొండ మండలానికి బదిలీ అయ్యారు. అదేవిధంగా మునుగోడు మండలానికి చెందిన వారు అదే మండలంలో స్పౌజ్‌ రేడియస్‌లో తీసుకోవాల్సి ఉన్నా చిట్యాల మండలానికి బదిలీ అయినట్లు తెలిసింది. స్పౌజ్‌ పాయింట్ల కింద ఉన్న ఉపాధ్యాయులు దగ్గర రేడియస్‌లో కాకుండా ఇష్టం ఉన్న మండలాలకు, అనుకూలంగా ఉన్న మండలాలకు బదిలీ కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆప్షన్‌లు పెట్టేటప్పుడు దగ్గర రేడియస్‌లో పెట్టకపోవడం, అధికారులు వాటిని పరిశీలించకపోవడంతో సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బదిలీలపై జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లి నాలుగు, అయిదు రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. జాబితాల తయారీలో పరిశీలన చేయకపోవడం, తప్పు జరిగిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య సరిష్కరించే విషయంపై జాప్యం అవుతుండటంపై ఆందోళన చెందుతున్నారు.


కొనసాగుతున్న విచారణ?

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: ఇటీవల నల్గొండ మండల పరిధిలోని చందనపల్లిలో రూ.500 నోట్ల కట్టలో పైనా, కింద నిజమైన నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి పలు మార్లు మోసాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఐదు రోజుల క్రితం ఇద్దరు నేరస్థులను రిమాండ్‌కు పంపడంతో పాటు రూ.24 లక్షలు స్వాధీనం చేసుకున్న విషయం విధితమే. ఉన్నత స్థాయి పోలీస్‌ అధికారుల ఆదేశాలతో మరో రూ.9 లక్షలు స్వాధీనంతో పాటు పరారీలో ఉన్న వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేస్తున్నారు. దీంతో పాటు నగదు రెట్టింపు చేసే వ్యవహారంలో బాధితులకు మొదటి సారిగా రూ.6,500 రెట్టింపు చేసిన నగదు రూ.13,000 ఎక్కడ చలామణి చేశారు. తాజాగా రూ.33 లక్షల నగదుతో నకిలీ నోట్లు రూ.66 లక్షలు తయారు చేస్తే ఎక్కడ చలామణి చేయాలనుకున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్నిసార్లు ఇలా తయారు చేశారు.. బాధితుల కోరిక మేరకే నేరస్థులు ఇక్కడికి వచ్చారా.. బిహార్‌కు చెందిన ముఠాతో బాధితులు గతంలో బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా, చరవాణి సంభాషణ ఎన్ని సార్లు జరిగింది. రూ.33 లక్షలు పోగు చేయడం వెనుక ఎంత మంది చేతులు ఉన్నాయనేది పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు