logo

పేదింటి వైద్యులు.. ఉచితంగా సేవలు

కనీస వసతుల్లేని మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినా.. తల్లిదండ్రుల, సోదరుల రెక్కల కష్టంతోనే వైద్య విద్యనభ్యసించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొలువులు సాధించారు. అతి సామాన్యులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు.

Published : 01 Jul 2024 04:33 IST

నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
మఠంపల్లి, న్యూస్‌టుడే

కనీస వసతుల్లేని మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినా.. తల్లిదండ్రుల, సోదరుల రెక్కల కష్టంతోనే వైద్య విద్యనభ్యసించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొలువులు సాధించారు. అతి సామాన్యులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. నేడు ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

కార్మికులకు వైద్య సేవలందించే భాగ్యం

భూక్యా శివశంకర్, చెన్నాయిపాలెం

అన్నయ్య లాలూనాయక్‌ సహకారంతో సొంత ఊళ్లో ప్రాథమిక విద్య అనంతరం మహబూబ్‌నగర్‌ వైద్య కళాశాలలో 2014లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాను. ఇదే జిల్లాలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో డయాలసిస్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జిగా పనిచేశాను. 2022 నుంచి హుజూర్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నా. అప్పట్లో ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా పేదరికం కారణంగా చదువు కొనసాగించలేని పరిస్థితుల్లో ‘ఈనాడు’ ప్రచురించిన కథనంతో ఎంతో మంది దాతలు స్పందించి ఆర్థిక సాయమందించారు. శ్రామికులకు చికిత్సలందించే పవిత్రమైన వృత్తిలో ఉన్నందుకు సంతృప్తికరంగా ఉంది.

ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివా..

బాణోతు బాలూనాయక్, బిల్యానాయక్‌తండా

ప్రాణదానం చేసే పవిత్రమైన వైద్యవృత్తి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. మఠంపల్లి మండలం బిల్యానాయక్‌తండా మా స్వగ్రామం. మేం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరం అన్నదమ్ములం. అమ్మానాన్నలు రెక్కల కష్టంతోనే నన్ను చదివించారు. నా విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే కొనసాగింది. ప్రతిభ ఆధారంగా గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, అనంతరం ఎండీ పూర్తిచేశాను. 2010లో ఖమ్మం జిల్లా ప్రాంతీయ వైద్యశాలలో కొలువు సాధించిన నేను ప్రస్తుతం సివిల్‌ సర్జన్‌గా సేవలందిస్తున్నాను. పల్లె ప్రజలు ఎక్కువగా చికిత్స కోసం మా దగ్గరకు వస్తుంటారు. అలాంటి వారికి సేవలందించడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది.

పేదలకు చికిత్సలు చేయడంలోనే సంతృప్తి

భూక్యా సుధాకర్‌నాయక్, చెన్నాయిపాలెం

మా కుటుంబంలో అన్నదమ్ములం ఇద్దరం వైద్యులమే. పేదరికాన్ని అనుభవిస్తూనే వైద్య విద్య పూర్తి చేశాం. అన్నయ్య హుజూర్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో, నేను మఠంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులుగా పని చేస్తున్నాం. కనీస సౌకర్యాలు లేని సొంత గ్రామం చెన్నాయిపాలెంలోనే ప్రాథమిక విద్య పూర్తిచేశాను. తండ్రి లేని నేను పెద్ద అన్నయ్య లాలూనాయక్‌ సహకారం, ప్రభుత్వ ఉపకార వేతనాలతో కరీంనగర్‌ వైద్య కళాశాలలో 2017లో ఎంబీబీఎస్‌ పూర్తిచేశాను. 2019లో మధిరలోని సీహెచ్‌సీలో వైద్యాధికారిగా విధుల్లో చేరాను. 2023 జనవరి నుంచి మఠంపల్లి పీహెచ్‌సీలో మండల వైద్యాధికారి(ఎంవో)గా విధులు నిర్వహిస్తున్నాను. నా ఆశయాలకు అనుగుణంగా పేదలకు వైద్యసేవలు అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను.

స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో..

డాక్టర్‌ బానావత్‌ బాలాజీ, చెరువు తండా

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: మాది సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం, జాన్‌పహాడ్‌ సమీపంలోని చెరువుతండా. అమ్మానాన్నలు రామ, సక్రిలు ఆకుకూరలు విక్రయిస్తూ నన్ను, తమ్ముడు, చెల్లిని చదివించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో శని, ఆదివారాల్లో కూలి పనులకు వెళ్లేవాడిని. అలా పదో తరగతిలో జిల్లా ప్రథమ స్థానం సాధించాను. నా ప్రతిభ చూసి మిర్యాలగూడలోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో ఉచిత విద్య అందించారు. ఎంసెట్‌లో 1,141వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో మూడో ర్యాంకు సాధించాను. ఎంబీబీఎస్‌ చదివే సమయంలోనే అమ్మకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రావడంతో ఓ వైపు చికిత్స అందిస్తూనే చదువు పూర్తి చేశాను. ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక పీజీ ప్రవేశ పరీక్షలో సైతం జాతీయ స్థాయిలో జనరల్‌ కేటగిరీ 709వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో మూడో ర్యాంకు సాధించాను. అనంతరం అనేక కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అవకాశం వచ్చినా.. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మిర్యాలగూడలో 2020లో ఆసుపత్రి ప్రారంభించాను. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 40 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాను. ప్రతి నెల జనయేత్రి ఫౌండేషన్, జనవిజ్ఞాన వేదిక వారి శిబిరాల్లో ఉచిత సేవలందిస్తున్నాను. పేదరికం నుంచి వచ్చినందున ఆర్థిక స్థోమత లేని వారు ఎంత ఇచ్చినా తీసుకుని వైద్యం చేస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు