logo

కృషి ఫలించె.. పురస్కారాలు వరించె

రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి.

Updated : 01 Jul 2024 05:56 IST

మోత్కూరు, న్యూస్‌టుడే

అమేయ కృషి విజ్ఞాన కేంద్రంలో భర్త జిట్టా బాల్‌రెడ్డితో జ్యోతిరెడ్డి

రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి. ఉన్నత చదువులు చదివినప్పటికీ వ్యవసాయం మీద మక్కువతో తన భర్త బాల్‌రెడ్డితో కలిసి 16 ఏళ్లుగా చెంతనే ఉన్న రామకృష్ణాపురంలోని ఆరున్నరెకరాల వ్యవసాయ క్షేత్రంలో అనేక రకాల మొక్కలు పెంచుతున్నారు. కూరగాయలూ పండిస్తూ, దేశవాలి ఆవులు, కోళ్లు, చేపల పెంపకం చేస్తూ లాభాలు గడిస్తున్నారు.

నర్సరీలో మొక్కలకు డిమాండ్‌..

వీరిది ప్రధానంగా సాగు మొక్కల పెంపకం. ఒక్క మామిడిలోనే 250కి పైగా రకాల మొక్కలుండటం విశేషం. కొన్ని మొక్కలను థాయిలాండ్, మలేషియా తదితర విదేశాల నుంచి తెప్పించి, వాటిని మన వాతావరణానికి అనుగుణంగా పెంచి, అంటుకట్టి, కొత్త రకాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పండ్లు, పూలు, ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కలను సేంద్రియ పద్దతిలో పెంచి అమ్ముతున్నారు. చీడపీడల నివారణకు హోమియో మందులు వాడటం వీరి ప్రత్యేకత. అనేక రకాల కూరగాయలు, ఆకుకూరల పండిస్తున్నారు. కూరగాయలను ఎండబెట్టి ఒరుగులు తయారుచేసి విక్రయించడానికి సొలార్‌ డ్రైయర్స్‌ ఉపయోగిస్తున్నారు. సంకరజాతి ఆవులు, గేదెలు పెంచి వాటి ఉత్పత్తుల ద్వారా ఆహార పదార్థాలను తయారుచేసి అమ్ముతారు.

ఆన్‌లైన్‌లో విక్రయాలు.. యూట్యూబ్‌లో పాఠాలు

నర్సరీలో పెంచిన మొక్కలను ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారు ఎక్కువగా ఖరీదు చేస్తున్నారు. జిట్ట జ్యోతిరెడ్డి, ఆమె భర్త బాల్‌రెడ్డి ‘అమేయ కృషి విజ్ఞాన కేంద్రం’ పేరుతో యూట్యూబ్‌ వేదికగా రైతులతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. నర్సరీల పెంపకం, సాగు పద్ధతులు, చీడపీడల నివారణపై సూచనలు ఇస్తున్నారు.

రైతులతో సేంద్రియ వ్యవసాయం చేయించాలని.. 

జిట్టా జ్యోతిరెడ్డి

రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటంతోనే వ్యవసాయంలో నష్టాలొస్తున్నాయి. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు లాభాల దిశగా పయనించవచ్చని చేసి చూపుతున్నాం. భర్త బాల్‌రెడ్డి తోడ్పాటుతోనే ఈ రంగంలో రాణిస్తున్నాను. ఎప్పటికైనా అన్నదాతలతో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేయించాలన్నదే మా ప్రయత్నం.

శ్రమకు దక్కిన అవార్డులు

దున్నకం నుంచి మొదలు, ఆన్‌లైన్‌ వ్యాపారం, రైతులకు సలహాలు ఇవ్వడం అన్నీ జ్యోతిరెడ్డే చూసుకుంటున్నారు. ఆమె పని విధానాన్ని చూసి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వారు జిల్లా స్థాయిలో ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు. అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం మహిళా రైతుగా గుర్తించి పురస్కారాలు, అవార్డులతో గౌరవించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు