logo

గ్యాస్‌ లీక్‌.. ముగ్గురికి అస్వస్థత

రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్‌ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది.

Published : 01 Jul 2024 04:18 IST

రసాయన పరిశ్రమలో గ్యాస్‌లీకైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఎస్సై భాస్కర్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్‌ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పరిశ్రమలో రియాక్టర్‌ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మున్నాలాల్, పరమేశ్వర్, దేశారన్‌లు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో వెంటనే 108కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు.  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.


పూడ్చిన మృతదేహానికి పరీక్ష

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఖననం చేసిన మహిళ మృతదేహాన్ని నాలుగు రోజుల తర్వాత వెలికి తీసి పరీక్ష నిర్వహించిన ఘటన ఆదివారం మిర్యాలగూడ మండల పరిధిలో చోటు చేసుకుంది. గ్రామీణ ఎస్సై నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అవంతిపురం గ్రామానికి చెందిన శివనేని అరుణ(43) ఏడాదిన్నర నుంచి యాద్గార్‌పల్లి శివారులోని ఎస్‌ఎమ్‌ఎస్‌9 ఆగ్రో ఆయిల్‌ సంస్థలో బస్తాలు కుట్టే పని చేస్తుంది. ఈ క్రమంలో మే 31న అస్వస్థతకు గురి కావడంతో మిర్యాలగూడ, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ జూన్‌ 25న మృతి చెందారు. అనంతరం అరుణ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే మిల్లు యాజమాన్యం అరుణకు సకాలంలో చికిత్స అందించకపోవడంతో శ్వాస సంబంధిత సమస్యతో మృతి చెందిందని జూన్‌ 29న ఆమె కుమారుడు ప్రేమ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తులో భాగంగా తహసీల్దారు హరిబాబు సమక్షంలో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పరీక్ష నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.


అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

విజయ మృతదేహం

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సదాశివపురం గ్రామానికి చెందిన జిల్లపల్లి అవినాష్‌కు సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన విజయ(31)తో పదమూడేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో విజయ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆమెను హుటాహుటిన నేలకొండపల్లి సీహెచ్‌సీకి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చూస్తుండగానే తనంతట తానే కుప్పకూలిందని భర్త, కుమార్తె వివరించారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కోట వెంకటయ్య, నర్సమ్మ, బంధువులు భారీగా నేలకొండపల్లికి చేరుకున్నారు. తమ కుమార్తె మృతికి భర్తే కారణమంటూ ఆందోళన చేశారు. మృతికి కారణాలు తెలపాలని ఠాణాలో ఇరువర్గాలు ఫిర్యాదు చేశాయి. ఠాణా ఎదుటే ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. మరణోత్తర పరీక్ష నిర్వహిస్తామని ఎస్సై నాగరాజు ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని