logo

మత్తు వదలరా..!

కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు.

Published : 01 Jul 2024 04:06 IST

కోదాడ, న్యూస్‌టుడే

కోదాడలో గంజాయి తాగుతూ, విక్రయిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు(పాత చిత్రం)

ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బడికి వెళ్లకుండా గంజాయి తాగుతూ, విక్రయిస్తున్నాడు. అతన్ని తల్లి విద్యుత్తు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. మత్తుకు బానిసైన కుమారుడిని మార్చే క్రమంలో విసిగిపోయిన ఆ తల్లి బుద్ధి చెప్పేందుకు ఇలా చేసింది. ఈ ఒక్క ఘటన చాలు.. ఇప్పుడున్న యువత చదువును వదిలేసి మత్తుకు బానిసలు అవుతున్నారనడానికి.

కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని బలి చేసుకుంటున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీసుకుంటూ, వాటిని విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటనలు పరిశీలిస్తే ప్రతి కేసులో యువకులే అధిక సంఖ్యలో ఉంటున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, చెడు ఆలోచనలు ఉన్న వారు స్నేహితులుగా తోడవ్వడంతో వారు దారి తప్పుతున్నారు.

ఇటీవలి ఘటనలు కొన్ని..

  • ఈ ఏడాది జూన్‌ 15న ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది యువకులు పట్టణ శివారుల్లో గుంపుగా ఏర్పడి గంజాయి తాగుతూ విక్రయిస్తున్నారు. నమ్మదగిన సమాచారంతో ఎక్సైజ్‌ పోలీసులు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని విచారించగా వారి దగ్గర 4.50 కిలోల గంజాయి లభ్యమవడం విశేషం. వీరందరూ విద్య నేర్చుకునే వయసువారే కావడం గమనార్హం.
  • జూన్‌ 28న కోదాడ పట్టణంలోని గుడిబండ రోడ్డులో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం మీద యథేచ్ఛగా తిరుగుతూ గంజాయి తాగుతూ విక్రయిస్తున్నారు. ఎక్సైజ్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి దగ్గర 900 గ్రాముల గంజాయి లభ్యమవ్వడంతో పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వయసు 25 ఏళ్ల లోపే ఉండటం గమనార్హం.
  • ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఏడుగురు యువకులు పట్టణ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల మీద గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. వారి దగ్గరి నుంచి సుమారు 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

బాధితులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం

శంకర్, ఎక్సైజ్‌ సీఐ, కోదాడ

గంజాయి తాగుతూ, విక్రయిస్తూ పట్టుబడిన యువతకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. చాలా మంది జులాయిగా తిరుగుతూ జల్సాలు చేయడానికి కావాల్సిన డబ్బుల కోసం గంజాయి విక్రయిస్తున్నారు. తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలి. పిల్లలు వినకపోతే నేరుగా మా దృష్టికి తీసుకొస్తే కౌన్సెలింగ్‌ ఇస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని