logo

పక్కాగా పంటల నమోదు

ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

Published : 01 Jul 2024 03:58 IST

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే

ఆత్మకూర్‌(ఎస్‌): పంటల నమోదును పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి

ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల సర్వర్‌ సమస్యలు తలెత్తినా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆగస్టు నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గడవు విధించింది. ఈ మేరకు ప్రస్తుతం పత్తి, కంది, జీలుగ, వరి తదితర పంటల లెక్క తేల్చుతున్నారు. వీటితోపాటు రైతుల బ్యాంకు, పట్టాదారు పాసుపుస్తకం, చరవాణి సంఖ్య, ఆధార్, తదితర వివరాలనూ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పించి ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తే శాఖాపరంగా చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తప్పుల సవరణకు అవకాశం

ఉమ్మడి జిల్లాలో వరి, పత్తి, మిర్చి, కంది, పెసర, ఇతర పంటలు 17,87,923 ఎకరాల్లో రైతులు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. అందుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 1,85,162 ఎకరాల్లో సేద్యంలో ఉన్న పత్తి, కంది, జీలుగ, తదితర పంటల వివరాలు నమోదు చేశారు. ఈ ప్రక్రియ నిర్వహణలో గతంలో వెనుకబడిన మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వేగంగా పూర్తి చేసేలా తగు ఏర్పాట్లు చేపడుతున్నారు. నమోదు పూర్తయిన తర్వాత జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించి రైతులు చూసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. తప్పులు నమోదైతే సవరించుకునే అవకాశం ఇవ్వనున్నారు.

నమోదు కాకుంటే ఇబ్బందులు

ఏటా వానాకాలం, యాసంగి సీజన్‌లలో ఉమ్మడి జిల్లాలో పత్తి, వరి, వేరుసెనగ, తదితర పంటలను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. పంట పేరు, సాగు విస్తీర్ణం వివరాలను నమోదు చేయించుకోకుంటే ఉత్పత్తులు విక్రయించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత ఆన్‌లైన్‌లో ఉన్న సాగు భూమికి సరిపడా దిగుబడి ఉండాలి. తేడాలుంటే నగదు చెల్లింపులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇలాగే నమోదు చేసుకోని రైతులు గతంలో ధాన్యం విక్రయించాక.. బిల్లులు రాక అధికారుల చుట్టూ తిరిగారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్నదాతలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వేగంగా పూర్తి చేసేలా చర్యలు

శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, సూర్యాపేట

జిల్లాలో ప్రస్తుతం పత్తి, కంది, జీలుగ వివరాలను వేగంగా నమోదు చేస్తున్నారు. అన్నదాతలు నార్లు పోస్తున్నారు.. నాట్లు పూర్తి కాగానే వాటినీ ఆన్‌లైన్‌ చేస్తాం. ప్రతి పంట వివరాలనూ తప్పనిసరిగా నమోదు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని