logo

సీఎంఆర్‌ బకాయిల వసూలుకు.. రంగం సిద్ధం

సీఎంఆర్‌ బకాయిల వసూలుకు ఆర్‌ఆర్‌ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు.

Published : 01 Jul 2024 03:54 IST

హుజూర్‌నగర్, న్యూస్‌టుడే

హుజూర్‌నగర్‌లో కల్లాల వద్ద ఉన్న ధాన్యం (పాత చిత్రం)

సీఎంఆర్‌ బకాయిల వసూలుకు ఆర్‌ఆర్‌ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు. కానీ, జూన్‌ 26న హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో మిల్లర్లు ఖంగుతిన్నారు.

ఆర్‌ఆర్‌ యాక్టుకు సన్నద్ధం

సీఎంఆర్‌ బకాయి బియ్యం వసూలు చేసేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు బకాయిపడిన మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు లేకుండా చేశారు. అలాంటి మిల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ఉండగా, ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 16 మంది ఉన్నారు. వీరందరినీ డీఫాల్టర్లుగా ప్రకటించారు. కోర్టుకు వెళ్తే తమకు బియ్యం చెల్లింపుపై వాయిదా దొరుకుతుందని వారు అధికారులను బెదిరిస్తూ వచ్చారు. దీంతో వారు కోర్టుకు పోకుండా బుజ్జగించే ధోరణిలో వసూలు చేసుకోవాలనే అధికారులు అనుకున్నారు. అయినా మిల్లర్లు వినే పరిస్థితి లేకపోవడంతో కొన్ని మిల్లులపై దాడులు చేసి, బాధ్యులను అరెస్ట్‌ చేశారు. ఒక్క సూర్యాపేటలోనే రూ.64 కోట్ల విలువైన బియ్యం పెట్టాల్సి ఉండటంతో అధికారులు దూకుడుగా వ్యవహరించారు. కోదాడ, సూర్యాపేటలోని కొందరు మిల్లర్లు కోర్టును ఆశ్రయించడంతో వారికి అక్కడ చుక్కెదురైంది. తీసుకున్న ధాన్యానికి బియ్యం వెంటనే ఇవ్వాలని, లేకుంటే ఏసీబీని రంగంలోకి దించుతామని, ఆర్‌ఆర్‌ యాక్టునూ అమలు చేస్తారని కోర్టు వ్యాఖ్యానించడంతో పౌరసరఫరాల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లకు ఇది మింగుడు పడకుండా ఉంది. 2019-20, 2020-21, 2021-22 వానాకాలం, యాసంగి, 2022-23 వానాకాలం సీజన్ల బకాయిల వసూలుకు మిల్లర్లపై కఠినంగా వ్యవహరించడంతో పాటు జప్తులు, అవసరమైతే క్రిమినల్‌ కేసులైనా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని