logo

మీ-సేవలో.. అక్రమాలకు చెక్‌

వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు.

Updated : 01 Jul 2024 06:01 IST

నేటి నుంచి నగదు రహిత చెల్లింపులు

రఘునాథపురం: మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు ప్రక్రియలో నిర్వాహకుడు

రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు. ఇప్పుడంతా ఆ సేవలన్నీ మీ-సేవ కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించిన సేవలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇందులో ఆయా సేవలకు సంబంధిత రుసుంలను ప్రభుత్వం నిర్దేశించింది. ఆ రుసుం వివరాలను వినియోగదారులు కనిపించేలా కేంద్రాల్లో బోర్డులు ప్రదర్శించాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ, టీఆర్‌ఎన్, టీజీటీఎస్‌ కలిపి మొత్తంగా 76 మీ సేవ కేంద్రాలున్నాయి. కొందరు నిర్వాహకులు నిర్దేశించిన రుసుంతో పాటు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గత కొంత కాలంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టింది.

కర్షకులకు తీరనున్న ఇక్కట్లు..

మీ సేవ కేంద్రాల్లో రుసుం చార్టుల్లో ఉన్న మొత్తానికి, వసూలు చేస్తున్న దానికి పొంతన ఉండటం లేదనే వాదనలున్నాయి. అదనపు వసూళ్లపై ప్రశ్నిస్తే జిల్లాలో అక్కడక్కడ నిర్వాహకులు దురుసుగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందినా, తరచూ అధికారులు తనిఖీలు చేపట్టినా వ్యవహారంలో మార్పు కనిపించడం లేదనేది వాస్తవం. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అదనపు వసూళ్లకు అడ్డుకట్ట పడే అవకాశం ఉండనుంది. చెల్లింపులు నగదు రహితం కావడంతో ఎంత వసూలు చేశారన్నది ఉన్నతాధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. అదనంగా తీసుకునే వారిపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ద్వారా..

మీ-సేవ కేంద్రాల్లో రెవెన్యూ పరమైన సేవలన్నింటికీ నగదు రహిత చెల్లింపులను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 1 నుంచి ఈ నూతన విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలనిస్తుండటంతో ఇక మీదట ప్రైవేటు కేంద్రాల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ద్వారా రుసుం వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలనే విషయం సంబంధిత మీ-సేవ కేంద్రాల నిర్వాహకులకు తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు.

అన్నింటా అమలుకు ఆదేశాలిచ్చాం

ఎన్‌.సాయికుమార్, జిల్లా ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌

నగదు రహిత చెల్లింపుల విధానం పక్కాగా అమలు చేసేందుకు మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. రెవెన్యూ సేవలేవీ ఉన్నా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానంలోనే రుసుం చెల్లించాలి. నిబంధనలు ఉల్లంఘించే ఎక్కువగా తీసుకునే వారిపై చర్యలు ఉంటాయి. ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు