logo

ప్రవేశాలు లేక.. కళాశాలలు వెలవెల

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల గడువు ముగిసినప్పటికీ లక్ష్యం మేరకు విద్యార్థులు చేరలేదు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి.

Updated : 30 Jun 2024 04:30 IST

యాదగిరిగుట్ట కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారిణి రమణి

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల గడువు ముగిసినప్పటికీ లక్ష్యం మేరకు విద్యార్థులు చేరలేదు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ కోర్సుల్లో 3080 మంది విద్యార్థులకు, వృత్తి విద్యా కోర్సుల్లో 1020 మందికి ప్రవేశాలు కల్పించే వీలు ఉన్నప్పటికి, ఇప్పటి వరకు జనరల్‌ కోర్సుల్లో 743 మంది,  వృత్తి విద్యా కోర్సుల్లో 487 మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకోవడం గమనార్హం. గత ఏడాది 1311 మంది ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందారు. ఏటేటా ప్రవేశాల సంఖ్య తగ్గుతుండటంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

కారణాలు ఇలా

  • గ్రామీణ, మండలాల పరిధిలో కేజీబీవీలు, గురుకులాల సంఖ్య ఏటేటా పెరుగుతుండటంతో పాటు అధ్యాపకుల ఖాళీలు ఉండటం, అతిథి అధ్యాపకుల నియామకాలు నిర్ణీత సమయంలో జరగపోవడం.
  • కొందరు విద్యార్థులు పదో తరగతి తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్‌లలో చేరుతుండటం.
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివి ఎంసెట్‌లో ర్యాంకు సాధించి ఏ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు ఫీజు మినహాయింపు, ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తున్నప్పటికి ప్రవేశాలు ఆశించిన మేరకు పెరగడం లేదు.

ప్రచారం నిర్వహించాం: రమణి, ఇంటర్‌ నోడల్‌ అధికారిణి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశాల గడువును జులై నెలాఖరు వరకు పెంచే అవకాశం ఉంది. జూనియర్‌ కళాశాలల్లోని వసతులు, సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వివరిస్తున్నాం. అతిథి అధ్యాపకులను ఇప్పటికే నియమించాం. మరో 18 మందిని నియమించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని