logo

మహిళా వ్యాపారులకు అందలం

అతివలు అన్ని రంగాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. అందులో భాగంగా వ్యాపారాల్లో స్థిరపడాలనే సదుద్దేశంతో 14 రకాల వ్యాపారాలను ఎంపిక చేసి అమలుకు కార్యాచరణ రూపొందించింది.

Updated : 30 Jun 2024 03:22 IST

సూర్యాపేట కలెక్టరేట్, ఆత్మకూర్‌(ఎస్‌),న్యూస్‌టుడే: అతివలు అన్ని రంగాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. అందులో భాగంగా వ్యాపారాల్లో స్థిరపడాలనే సదుద్దేశంతో 14 రకాల వ్యాపారాలను ఎంపిక చేసి అమలుకు కార్యాచరణ రూపొందించింది. స్వయం సహాయ సంఘాల సభ్యులకు మండలాల వారీగా వ్యాపారాలు కేటాయించి, ఎంపిక చేసిన వారికి రుణాలు సైతం కల్పించే ఏర్పాట్లు చేసింది.  ఈ అంశాలపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో సైతం స్వయం సహాయక సంఘం అధ్యక్షురాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు.  ప్రస్తుతం ఏపీఎంలు యూనిట్ల ఎంపిక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అతివలు వ్యాపారాలను ప్రారంభించేలా అధికార యంత్రాంగం కసరత్తు చేపడుతుంది.

11,348 మంది సభ్యులకు లబ్ధి

జిల్లాలోని 23 మండలాల్లో 18,163 స్వయం సహాయ సంఘాలలో 1,81,258 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 14 రకాల వ్యాపారాలలో జిల్లా వ్యాప్తంగా 8,623 యూనిట్లు మంజూరు చేసింది. అందుకు కావాల్సిన రూ.86.78 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. కొన్ని వ్యాపారాలకు కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 20 శాతం వరకు ఖర్చు చేయనుంది. మహిళా సంఘాలకు యూనిట్లు కేటాయిస్తే 11,348 మంది సభ్యులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే ఏకరూప దుస్తుల కుట్టడం ద్వారా జిల్లా వ్యాప్తంగా 34 యూనిట్లలో 712 మంది సభ్యులకు మేలు జరిగింది. వారు రూ.1.90 కోట్ల ఆదాయం పొందారు. దీని స్ఫూర్తితో మిగతా వ్యాపారాలను అమలు చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు.

అత్యధికంగా మైక్రో యూనిట్లు

ఎంపిక చేసిన వ్యాపారాల్లో అత్యధికంగా 4,972 మైక్రో యూనిట్లు ఉన్నాయి. అందులో అంతే మందికి లబ్ధి చేకూరనుంది. ఆరు యూనిట్లను 23 మండలాల్లోనూ అమలు చేయనున్నారు. అందులో ప్రధానంగా దుస్తులు కుట్టుట, గేదెలు, పెరటి కోళ్లు, కోళ్ల ఫారం పంపిణీ, మీసేవ కేంద్రాల వ్యాపారాలను జిల్లాలోని ప్రతి మండలానికి కేటాయించారు. మరికొన్ని యూనిట్లను కేవలం కొన్నింట్లో ఒకటి చొప్పున మంజూరు చేయనున్నారు. అందులో సోలార్‌ యూనిట్‌ను అనంతగిరిలో, చేపల విక్రయ వాహనాన్ని చింతలపాలెం, మోతె, చివ్వెంల, పాలకవీడు మండలాల్లో ఒకదాన్ని ఎంపిక చేయనున్నారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కింద హుజూర్‌నగర్‌ మండలానికి, ప్లాస్టిక్‌ వేస్టే మేనేజ్‌మెంట్‌ను చివ్వెంల, క్యాంటీన్లు కోదాడ, తిరుమలగిరి, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు