logo

పల్లీ రైతు దిగాలు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వేరుసెనగకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. సాగు సమయంలో ధర ఉండగా.. పంట చేతికొచ్చాక తగ్గడంతో అన్నదాతలు నష్టాలను చవిచూస్తున్నారు.

Published : 30 Jun 2024 03:16 IST

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో వేరుసెనగ రాసి

భానుపురి, న్యూస్‌టుడే: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వేరుసెనగకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. సాగు సమయంలో ధర ఉండగా.. పంట చేతికొచ్చాక తగ్గడంతో అన్నదాతలు నష్టాలను చవిచూస్తున్నారు. కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. ఆరుగాలం కష్టపడిన పంట పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో అసహనానికి లోనవుతున్నారు. పంటలు సాగుచేసి మరో నెలకు చేతికొచ్చే సమయం వరకు క్వింటా వేరుసెనగా రూ.9వేలకు పైగా ఉంటోంది. తీరా పంట నూర్పిడి జరిగిన తర్వాత తగ్గటంలో మతలబు ఏమిలో అంతుచిక్కటం లేదని కర్షకులు వాపోతున్నారు.

సాగు ఇలా..

సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరం 869 ఎకరాల్లో రైతులు వేరుసెనగ సాగు చేపట్టారు. దీన్ని ఎక్కువ మంది రైతులు అంతర పంటగా పండిస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో గరిష్ఠ ధర రూ.5,909 పలుకుతోంది. జిల్లాలో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోనే ఎక్కువగా వేరుసెనగ సాగు చేస్తున్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఎక్కువగా వరి పండిస్తున్నారు.  తుంగతుర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాల రైతులు సూర్యాపేట మార్కెట్‌కు పంట ఉత్పత్తులను తీసుకొస్తున్నారు. మిగతా రైతులు తిరుమలగిరి మార్కెట్‌కు వెళ్తారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రాంత రైతులు సూర్యాపేట మార్కెట్‌లోనే వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వేరుసెనగ పంటకు ప్రస్తుతం డిమాండ్‌ తక్కువగా ఉంది. ఈ కారణంగానే ధర పెరగటం లేదని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. సీజన్‌ ముగియడంతో పంట తక్కువగా మార్కెట్‌కు వస్తోందని పేర్కొంటున్నారు. వచ్చిన పంట కూడా నాణ్యతగా లేక ఖరీదుదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపటం లేదని, బయట ప్రాంతాల్లో ఇక్కడికి సరకుకు ఆశించినంత డిమాండ్‌ లేక ధర పెరగటం లేదని మార్కెట్‌ కార్యదర్శి రాహుల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని