logo

పదోన్నతులు దారి తప్పాయా..

ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయన్న వాదన వినిపిస్తోంది. పలువురు అడ్డదారుల్లో, నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందారని, పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.

Published : 30 Jun 2024 02:58 IST

పలుచోట్ల ఉపాధ్యాయ సంఘాల ఆందోళన

చింతపల్లి మండలం కొర్రమాన్‌సింగ్‌ తండాలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన శివరంగాచారి ఈ ఏడాది ఫిబ్రవరిలో రహదారి ప్రమాదంలో మరణించారు. తాజాగా అధికారులు విడుదల చేసిన పదోన్నతుల జాబితాలో ఆయన ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ - గణితం)గా పదోన్నతి పొంది డిండి మండలం గోనబోయినపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలకు బదిలీ అయినట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని ఎస్జీటీ ఉపాధ్యాయులకు సంబంధించి సీనియార్టీ జాబితాను తయారుచేసి.. అభ్యంతరాలుంటే తెలపాలని ఒకటికి రెండు సార్లు జాబితాను వెల్లడించారు. పలుమార్లు ఆ జాబితాను మార్చి తుది జాబితాను తయారు చేశారు. ఇన్ని జరిగినా నాలుగు నెలల క్రితం మరణించిన ఉపాధ్యాయుడిని గుర్తించకపోవడం గమనార్హం. అధికారులు మాత్రం సీనియార్టీ జాబితాలో మరణించిన ఉపాధ్యాయుడి పేరును తీసేసినా సాంకేతిక తప్పిదంతో పదోన్నతుల జాబితాలో పేరు వచ్చిందని చెబుతున్నారు.

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, నల్గొండ విద్యావిభాగం :ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయన్న వాదన వినిపిస్తోంది. పలువురు అడ్డదారుల్లో, నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందారని, పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల్లో ఈ అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

  • వ్యాయామ విద్య ఉపాధ్యాయుల్లో చాలా మంది మహారాష్ట్రలోని పలు కళాశాలల నుంచి ధ్రవీకరణ పత్రాలతో పదోన్నతులకు దరఖాస్తు చేశారు. కొంత మంది నకిలీ పత్రాలతోనే దరఖాస్తు చేసినట్లు సంబంధిత ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) కోర్సు చేయాలంటే జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి అనుమతితో కనీసం 180 రోజుల వరకు పాఠశాలలకు సెలవు పెట్టాల్సి ఉంటుంది. మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో చాలా మంది అక్కడి ధ్రువపత్రాలు సమర్పించి పదోన్నతులకు దరఖాస్తులు చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
  • మరికొందరు బీపీఈడీ కోర్సు పూర్తి చేశాక.. అండర్‌ గ్రాడ్యూయేట్‌ డిప్లొమా ( యూజీడీ) కోర్సు పూర్తి చేశామని ధ్రువపతాలు సమర్పించారు. బీపీఈడీ పూర్తి చేసిన తర్వాత దానికన్న తక్కువ కోర్సు అయిన యూజీడీని ఎలా పూర్తి చేస్తారని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ధ్రువపత్రాలను సరిగా పరిశీలిస్తే ఏవి అసలువో..ఏవి నకిలీవో తెలుస్తాయని పలువురు ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. మరోవైపు ఎస్జీటీ నుంచి ఎస్‌ఏగా పక్షం రోజుల నుంచి పదోన్నతులు పొందిన వారు శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఇలా ఒక్క నల్గొండ జిల్లాలోనే సుమారు 25 మందికిపైగా ఉన్నారు.

పారదర్శకంగానే పదోన్నతులు, బదిలీలు

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల క్రతువులో ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగలేదు. ప్రక్రియంతా పారదర్శకంగా జరిగింది. ఫిర్యాదులొచ్చిన ఉపాధ్యాయులపై సమగ్రంగా పరిశీలించి అవన్నీ సరైనవి అని ధ్రువీకరించుకున్నాకే వారికి బదిలీలు ఇచ్చాం. ఎవరికైనా అనుమానాలుంటే మాకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.

బొల్లారం భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో), నల్గొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు