logo

అలుపెరగని శిక్షకుడు తూము హన్మంతరావు

వేతనం కోసం నిర్ణీత సమయం వరకే పని చేయకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విధులు నిర్వర్తించి.. పిల్లల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి..

Published : 30 Jun 2024 02:50 IST

గుండ్లసింగారంలో హన్మంతరావు దంపతులను సన్మానించి జ్ఞాపిక అందజేస్తున్న నూతనకల్‌ జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయ బృందం

నూతనకల్, న్యూస్‌టుడే: వేతనం కోసం నిర్ణీత సమయం వరకే పని చేయకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విధులు నిర్వర్తించి.. పిల్లల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి.. శిక్షణతో మెరుగులద్ది  ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి వ్యాయామ ఉపాధ్యాయుడు తూము హన్మంతరావు అని పూర్వ విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు పేర్కొన్నారు. ఆయన అలుపెరగని శిక్షకుడని, వచ్చే వేతనంలో మూడు వంతు విద్యార్థుల ఉన్నతి కోసం ఖర్చు చేసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తూము హన్మంతరావు శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన సన్మాన మహోత్సవాన్ని మండలంలోని గుండ్లసింగారం ఐఎల్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్‌ శాఖలో డీఎస్పీ, సీఐ, ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్స్‌గా, వ్యాయామ ఉపాధ్యాయులుగా, మున్సిపల్‌ కమిషనర్, రైల్వే శాఖ, ప్రజాప్రతినిధులు, ఇలా వివిధ హోదాలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు 200 మంది వరకు తరలివచ్చారు. తమ ఉన్నతికి పాటుపడిన ఉపాధ్యాయుడు హన్మంతరావు, పుష్పలత దంపతులను పూలమాలలు, శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేసి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. హోటళ్లలో, వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటున్న తమను పట్టు పట్టి పాఠశాల మైదానానికి తీసుకెళ్లి తమలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వెలికితీసి ఉన్నత స్థితికి చేర్చారని గుర్తుచేశారు. సమాజంలో తమకంటూ ఒక స్థానం కల్పించిన గురువుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. అంతకు ముందు పాఠశాల నుంచి ఫంక్షన్‌హాల్‌ వరకు ఉపాధ్యాయుడు ఉన్న వాహనాన్ని పూర్వ విద్యార్థులు తాడుతో లాగుతూ తీసుకొచ్చారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములునాయక్, ఎంపీపీ బూరెడ్డి కళావతి, ఎంపీటీసీ సభ్యురాలు పన్నాల రమ, పీఏసీఎస్‌ ఛైర్‌పర్సన్‌ నాగం జయసుధ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మధుసూదన్‌రావు, పూర్వ విద్యార్థులు, మున్సిపల్‌ కమిషనర్‌ సాబెర్‌హాలీ, డిప్యూటీ రిజిస్ట్రార్‌ పద్మజ, రైల్వే సీనియర్‌ ఇంజినీర్‌ ఫరీద, రైల్వే అధికారి శ్రీనివాస్, పోలీస్‌శాఖ అధికారులు నాగమల్లు, వాసుదేవ్, రాజు, శ్రీనునాయక్, భువనగిరి పట్టణ సీనియర్‌ క్రీడాకారులు, నూతనకల్‌ మండల సీనియర్, జూనియర్‌ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు