logo

భ్రూణ హత్యపై విచారణ.. ఆసుపత్రుల సీజ్‌

భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో కోటాచలం హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారి ఆసుపత్రులను, ల్యాబ్‌లను సీజ్‌ చేస్తామన్నారు.

Updated : 30 Jun 2024 03:36 IST

హుజూనగర్‌లోని ఆసుపత్రిలో దస్త్రాలను తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో కోటాచలం

హుజూర్‌నగర్, న్యూస్‌టుడే: భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో కోటాచలం హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారి ఆసుపత్రులను, ల్యాబ్‌లను సీజ్‌ చేస్తామన్నారు. శనివారం హుజూర్‌నగర్‌లో వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూ కమల ఆసుపత్రి రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకొని ఆసుపత్రిని సీజ్‌ చేశారు.  నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సదరు ఆసుపత్రిని, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కమల డెంటల్‌ ఆసుపత్రిని కూడా సీజ్‌ చేసినట్లు తెలిపారు. సృష్టికి మూలమైన ఆడ శిశువులను స్కానింగ్‌ చేసి గర్భంలోనే చంపేయటం హేయమైన చర్య అని పేర్కొన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలపై ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల తీవ్రతను ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో నిరంజన్, అంజయ్య, కార్తీక్, ఇందిరాల రామకృష్ణ తదితరులున్నారు.
కోదాడ: పట్టణంలోని విజయ ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారి కోటాచలం శనివారం సీజ్‌ చేశారు. ఇటీవల ఏడు నెలల నిండు గర్భిణికి లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆమె మృతికి కారణమైనట్లు అధికారులు నిర్ధారించి.. ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సదరు గర్భిణికి లింగనిర్ధారణ పరీక్ష చేసిన తర్వాత ఇదే ఆస్పత్రిలో అబార్షన్‌ చేయాలని భావించినా బేరం కుదరకపోవడంతో హుజూర్‌నగర్‌లోని కమల ఆస్పత్రికి తీసుకెళ్లిన్నట్లు తెలిపారు. ఆస్పత్రిలోని ఇద్దరు కాంపౌండర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మఠంపల్లి: భ్రూణ హత్య ఘటనకు సంబంధించి డాక్టర్‌ నాగేందర్‌ ఆసుపత్రిని మఠంపల్లిలో సీజ్‌ చేసిన అనంతరం డీఎంహెచ్‌వో కోటాచలం స్థానిక పీహెచ్‌సీలో విలేకరులతో మాట్లాడారు. ప్రాథమిక విచారణలో రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) హుజూర్‌నగర్‌ ప్రాంత వైద్యాధిÅకారిగా పనిచేస్తున్న నాగేందర్‌కు సంబంధం ఉన్నట్లు తేలటంతో మండల కేంద్రంలోని వైద్యశాలను మూసివేసినట్లు తెలిపారు. జిల్లా వైద్య మీడియా అధికారి అంజయ్యగౌడ్, మండల వైద్యాధికారి సుధాకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని