logo

పదవులన్నీ హస్తగతం

అసెంబ్లీ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో 11 స్థానాల్లో విజయం.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలుపు.

Updated : 29 Jun 2024 05:26 IST

ఈనాడు, నల్గొండ

విజయ కేతనం చూపుతున్న కాంగ్రెస్‌ డైరెక్టర్లు

అసెంబ్లీ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో 11 స్థానాల్లో విజయం.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలుపు. కానీ కీలకమైన స్థానిక సంస్థల్లో భారాసకు చెందిన నేతలు ఎక్కువగా ఉండటంతో వారిని పార్టీలో చేర్చుకునే విధంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ప్రధానంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే ఉమ్మడి జిల్లాలోని చాలా మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌లు భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. కొన్ని చోట్ల పార్టీ అధికారంలోకి వచ్చాక అవిశ్వాసం పెట్టి పదవీచ్యుతులను చేశారు. తాజాగా కీలకమైన డీసీసీబీ పీఠాన్ని సైతం కైవసం చేసుకోవడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పదవులన్నీ కాంగ్రెస్‌ పార్టీ ఆధీనంలోనే ఉన్నట్లైంది.  క్షేత్రస్థాయిలో పార్టీకి కీలకమైన సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకట్రెండు నెలల్లో జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం పార్టీకి అనుకూలంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్పంచి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగియగా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం జులై మొదటివారంలో ముగియనుంది.

స్థానిక ఎన్నికల్లో గెలుపునకు కాంగ్రెస్‌ పార్టీ రెండంచెల వ్యూహాలను అమలు చేస్తోంది. తొలుత ఇతర పార్టీలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం, ప్రస్తుతం పదవీలో ఉన్న వారిని అవిశ్వాసం ద్వారా పదవీచ్యుతులను చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మూడు జిల్లాల్లోనూ వీలైనన్నీ ఎక్కువగా పురపాలికలతో పాటూ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలుచుకోవాలని ఇప్పటికే పార్టీ ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో.. ఆ మేరకు క్షేత్రస్థాయి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. మరోవైపు పదేళ్లలో పూర్తి చేయలేక, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటూ పలు అభివృద్ధి పనులకు భారీగా నిధులు వెచ్చించాలని స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. త్వరలోనే ప్రభుత్వ స్థాయిలో కీలక పదవులు, నామినేటెడ్‌ పోస్టులను సైతం భర్తీ చేస్తారనే సమాచారంతో క్షేత్రస్థాయిలో ఇతర పార్టీల నేతల నుంచి ఇబ్బందులు లేకుండా సీనియర్‌ నేతలు, ఆశావహులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

అంతకంతకూ పడిపోతున్న భారాస బలం

పదేళ్ల పాటూ అధికారంలో ఉన్న భారాస బలం ఉమ్మడి జిల్లాలో అంతకంతకూ పడిపోతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధికం భారాసనే కైవసం చేసుకుంది. పురపాలిక ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో అన్నింట్లోనూ ఆ పార్టీకి చెందిన ఛైర్మన్‌లనే పార్టీ నాయకులు గెలపించుకున్నారు. మూడు జిల్లా పరిషత్‌లను సైతం కైవసం చేసుకుంది. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. ఉమ్మడి జిల్లాలో కేవలం సూర్యాపేట, నకిరేకల్, పోచంపల్లి, చండూరులో మాత్రమే భారాసకు చెందిన వారు ఛైర్మన్‌లుగా ఉండగా..మిగతావన్నీ కాంగ్రెస్‌ ఆధీనంలో ఉన్నాయి. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా పట్టు సంపాదించే విధంగా ఇప్పటినుంచే కసరత్తు చేయాల్సి ఉందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని