logo

చరవాణితో..హాని..!

జిల్లాలో కొందరు బాలికలు పోకిరీల మాయమాటలు నమ్మి..ప్రేమ పేరుతో గడప దాటుతున్నారు. నిజాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

Updated : 29 Jun 2024 05:38 IST

కౌన్సెలింగ్‌ కేంద్రాలకు రెండేళ్లలో 194 ఫిర్యాదులు

నార్కట్‌పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్‌ చదువుతున్న 16 ఏళ్ల బాలిక.. అదే ప్రాంతానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ (22)తో ప్రేమలో పడింది. గ్రహించిన తల్లిదండ్రుల ఫిర్యాదుతో భరోసా కేంద్రం నుంచి బాల సదన్‌కు తరలించారు. తీసుకున్న కౌన్సెలింగ్‌ ద్వారా బాలిక తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరింది.

జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిన్నారి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. చరవాణి ద్వారా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పరిచయం కావడంతో తప్పుదారి పట్టింది. సఖీ కేంద్రం ద్వారా కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో బాలికలో మార్పు వచ్చి తిరిగి పాఠశాలకు వెళ్తోంది.

నల్గొండ అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో కొందరు బాలికలు పోకిరీల మాయమాటలు నమ్మి..ప్రేమ పేరుతో గడప దాటుతున్నారు. నిజాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. భరోసా, సఖీ కేంద్రాలతో పాటు బాలసదన్‌ వంటి కేంద్రాలు స్పందించి కొంత మందికి మరో జీవితాన్ని ఇస్తున్నా.. మరి కొందరు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలు మాయం కావడం, ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ వంటి పెద్దలు లేకపోవడం, చరవాణి వినియోగాలు పెరగడం.. కారణం ఏదైనా ఇటీవలి కాలంలో  కొంతమంది బాలికలు అదుపు తప్పుతున్నారు.వివిధ కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో గడిచిన రెండేళ్లలో 194 మంది కౌన్సెలింగ్‌ పొందారు. ఇవి కాకుండా స్థానిక పోలీస్‌స్టేషన్లు, పెద్దల సమక్షంలో రాజీలు కుదుర్చుకునే వారి సంఖ్య కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. నిర్భయ, పోక్సో లాంటి చట్టాలు వస్తున్నా.. మాయగాళ్లలో మార్పు రావడం లేదు.


ఆ వయసులో జాగ్రత్తలు అవసరం

డా.శివరామకృష్ణ, మానసిక వైద్యుడు, నల్గొండ

చిన్న వయసులో కలిగేది ప్రేమ కాదు ఆకర్షణ మాత్రమే. పాఠశాల వయసులోనే ప్రేమ అంటూ ఇబ్బందులు పడే కొంత మంది బాలికలు తల్లిదండ్రులతో కలిసి తమ వద్దకు కూడా వస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎక్కువ మంది బాలికలు చరవాణులు వినియోగిస్తున్నారు. దీంతో కొంత మంది బాలికలు అశ్లీలం వైపు మొగ్గుచూపి పక్కదారి పడుతున్నారు. పదేళ్ల వయసు నుంచి పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. చదువుతో పాటు క్రీడల వైపు వారి దృష్టిని మళ్లించాలి. విద్యా సంస్థల్లోనూ ఖాళీ సమయంలో ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి.


కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం

సక్కుబాయి, పీడీ ఐసీడీఎస్, నల్గొండ

సఖీ, భరోసా, బాలసదన్‌ కేంద్రాలకు ఏటా 80 నుంచి 100 మంది వరకు బాలికలపై వేధింపులు, ప్రేమ విఫలం వంటి ఫిర్యాదులు వస్తున్నాయి. కేంద్రానికి వచ్చే బాలికలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. 18 ఏళ్లలోపు వారికి బాల సదన్‌లో వసతి కల్పిస్తున్నాం. దీంతో కొంత మందిలో మార్పు వచ్చి తల్లిదండ్రుల వద్దకు చేరుతున్నారు. 181 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు వచ్చే ఫిర్యాదులకు ప్రత్యేక వాహనంలో వారి వద్దకు వెళ్తున్నాం. అవసరమైతే కేంద్రానికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు, న్యాయ సలహాలు ఇస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని