logo

ఉన్నత విద్యా వేదిక..!

ఒకప్పుడు ఆరు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం అది. ఇప్పుడు 22 కోర్సులతో..రెండు వేల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది.

Updated : 29 Jun 2024 06:33 IST

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు వేళాయె
నల్గొండ టౌన్, న్యూస్‌టుడే

ఎంజీయూలో సైన్స్‌ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్న విద్యార్థులు

ఒకప్పుడు ఆరు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం అది. ఇప్పుడు 22 కోర్సులతో..రెండు వేల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. భిన్న బోధన పద్ధతులు, మెరుగైన వసతులతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు దిక్చూచిలా..వారి ఉజ్వల భవితకు పునాదిలా మారింది. అదే నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం. 2007లో 247 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ వర్సిటీలో ప్రస్తుతం సైన్స్‌ కళాశాల, ఆర్ట్స్‌ కళాశాల, కామర్స్‌ కళాశాలలు కొనసాగుతున్నాయి. సుమారు 1200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇన్‌ఛార్జి వీసీగా ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిత్తల్, రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ అల్వాల రవి వ్యవహరిస్తున్నారు. మూడు స్నాతకోత్సవాలు పూర్తి చేసుకొని..ప్రస్తుతం న్యాక్‌ బీప్లస్‌ గ్రేడ్‌తో కొనసాగుతున్న వర్సిటీ 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతోంది.

బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు సైతం

ఎంజీయూలో అదనంగా బీటెక్, ఎంబీఏ, ఎంబీఏ టీటీఎం, ఎంసీఏ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. బీటెక్‌లో ఈసీఈ 60, ఈఈఈ 60, సీఎస్‌ఈలో 120,  ఎంబీఏలో 60, ఎంబీఏ టీటీఎంలో 60, ఎంసీఏలో 60 సీట్లు ఉన్నాయి.

సీపీగెట్, ఎఫ్‌సెట్, ఐసెట్‌ ద్వారా ప్రవేశాలు

ఎంజీయూలో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు సీపీగెట్, ఎఫ్‌సెట్, ఐసెట్‌ ప్రవేశ పరీక్షలు రాయాలి. ఫలితాల అనంతరం జరిగే  కౌన్సెలింగ్‌లో వర్సిటీని ఎంచుకుంటే అందులో ప్రతిభను బట్టి వర్సిటీలోని కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.

వర్సిటీలో అందుబాటులో సకల సౌకర్యాలు

వర్సిటీలో విశాలమైన గ్రంథాలయం, సౌకర్యవంతమైన బాలుర, బాలికల హాస్టల్స్, ఆర్ట్స్‌ కళాశాలకు, సైన్స్‌ కళాశాలకు, ఇంజినీరింగ్‌ కళాశాలలకు ప్రత్యేకమైన భవనాలు, ఆధునాతన ప్రయోగశాలలు, సెమినార్‌ హాల్, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు, పరీక్షల విభాగానికి ప్రత్యేకమైన భవనం, ఆయా క్రీడల మైదానాలు, శుద్ధజలం, క్యాంటీన్, చక్కటి అంతర్గత రహదారులు, స్టాప్, వీసీ క్వార్టర్స్, ప్లేస్‌మెంట్‌ సెల్, ర్యాంగింగ్‌ సెల్, ఐలాండ్‌ పార్కు, పరిపాలన భవనంలో లిప్ట్‌ సౌకర్యం ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి.

వర్సిటీలో మెరుగైన విద్య

నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యా పూర్తిచేసేందుకు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం చక్కటి వేదిక. ఇక్కడ విద్యార్థులకు కావాల్సిన సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వర్సిటీలో ఆయా కోర్సులు పూర్తిచేసే విద్యార్థులు ఆయా శాఖల్లో ప్రభుత్వ కొలువులతో పాటు వివిధ సంస్థల్లో స్థిరపడుతున్నారు. మెరుగైన విద్యనందిస్తున్న ఈ వర్సిటీలో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపాలి.

మారం వెంకటరమణారెడ్డి, ఎంజీయూ యూసీసీ,బీఎం ప్రిన్సిపల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని