logo

చేనేత కళాకారులకు అవార్డులు

తెలంగాణ హస్తకళలకు పుట్టినిల్లు. సింధు నాగరికత కాలం నుంచి కళలు వర్థిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. రాజుల కాలంలో కళాకారులకు ఆదరణ లభించేది. వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించేవారు.

Published : 29 Jun 2024 03:50 IST

జులై 10 వరకు దరఖాస్తులకు అవకాశం
చౌటుప్పల్, న్యూస్‌టుడే

చేనేత వస్త్రం (పాత చిత్రం)

తెలంగాణ హస్తకళలకు పుట్టినిల్లు. సింధు నాగరికత కాలం నుంచి కళలు వర్థిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. రాజుల కాలంలో కళాకారులకు ఆదరణ లభించేది. వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించేవారు. ఉపాధి కల్పించేవారు. అద్భుతమైన కళాకారులను గుర్తించి నజరానాలిచ్చేవారు. రాచకొండ రాజధానిగా పాలించిన రేచర్ల పద్మనాయకుల పాలనలోనూ రాజాస్థానంలో కళాకారులను ఆదరించారు. గోలకొండను ఏలిన రాజులూ కళలను ప్రోత్సహించారు. నైజాం పాలనలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కళాకారులు మగ్గాలపై నేసే రుమాళ్లను వ్యాపారులు కొనుగోలు చేసి అరబ్‌ దేశాలకు ఎగుమతి చేసేవారు. ఆంగ్లేయుల పాలనలో ఇక్కడి భారతీయ వస్త్ర పరిశ్రమను దెబ్బతీసి విదేశీ వస్త్రాలను దిగుమతి చేయడంతో చేనేత కళాకారుల ఉపాధికి గండి పడింది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో రాట్నం జాతీయ చిహ్నంగా మారింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించి ఖద్దరు ధరించారు. స్వాతంత్య్రానంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేనేత కళాకారులకు ప్రత్యేకంగా శిక్షణనిప్పించి ‘ఇక్కత్‌’ డిజైన్లతో వస్త్రాలు తయారు చేయించడంతో ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక్కడి కళాకారులు తమ సృజనాత్మకతతో వినూత్న వస్త్రాలకు రూపకల్పన చేసి జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించి చేనేత కీర్తిని పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చేనేత కళాకారులను గుర్తించి 2018లో ‘కొండా లక్ష్మణ్‌ బాపూజీ’ పేరిట రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రవేశపెట్టారు. ఎంపికైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈయేడు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంలో అయిదు విభాగాల్లో మగ్గం నేసే కళాకారులకు, డిజైనర్లకు 30 అవార్డులు ప్రదానం చేయనున్నారు. పురస్కార గ్రహీతలకు రూ.25వేల నగదు, శాలువా, జ్ఞాపిక, మెరిట్‌ సర్టిఫికెట్‌ అందజేసి సన్మానిస్తారు.

అర్హతలు

  • చేనేత కళాకారులు 2023 డిసెంబరు 31 నాటికి 30 ఏళ్ల వయసు నిండాలి. చేనేత రంగంలో పదేళ్ల అనుభవం ఉండాలి.
  • చేనేత డిజైనర్లు 25 ఏళ్ల వయసు నిండి ఉండాలి. చేనేత రంగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.
  • అర్హతలున్నవారు తమ నైపుణ్యాన్ని చాటే నమూనాలను చేనేత, జౌళి శాఖ ఏడీకి జూలై పదో తేదీలోగా అందజేయాలి.
  • పూర్తి వివరాలకు చేనేత, జౌళి శాఖ యాదాద్రి జిల్లా ఏడీ చరవాణి: 98493 91548, నల్గొండ ఏడీ చరవాణి: 99121 83164 లను సంప్రదించవచ్చు.

అయిదు విభాగాల్లో అవార్డులు

1. పొచంపల్లి ఇక్కత్‌

2. గద్వాల చీరలు

3. నారాయణపేట చీరలు

4. డర్రీలు

5. సాధారణ రకాలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని