logo

గర్భిణి మృతికి కారకులైన ఏడుగురిపై కేసు నమోదు

చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్‌తోపాటు మరో ఆరుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు.

Published : 29 Jun 2024 03:44 IST

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్‌తోపాటు మరో ఆరుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మూడో కాన్పులో ఏడు నెలల గర్భణి అయిన సుహాసినికి ఆమె భర్త లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి పుట్టబోయేది ఆడబిడ్డగా తెలుసుకొని ఎలాగైనా గర్భవిచ్ఛిత్తి చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు హుజూర్‌నగర్‌లోని కమల ఆసుపత్రిలో ఐదు రోజుల క్రితం ఆమెకు అబార్షన్‌ చేయించాడు. చికిత్స వికటించి ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మొదట కోదాడ, అక్కడి నుంచి ఖమ్మం, అనంతరం సూర్యాపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. సూర్యాపేటకు తరలిస్తుండగానే మార్గమధ్యలో ఆమె మృతిచెందినట్లు మంగళవారం వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తె మృతికి కారణమైన హరిసింగ్‌తోపాటు కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసు స్టేషన్లో తండ్రి భట్టు కృష్ణ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భర్త హరిసింగ్‌తోపాటు మృతురాలి అత్త, ఇద్దరు ఆడపడచులు, హుజూర్‌నగర్‌లోని కమల ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందిపై మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఈ కేసును చివ్వెంల స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని