logo

విద్యుత్తు సమస్యలకు సర్వేతో చెక్‌

జిల్లాలోని విద్యుత్తు సిబ్బంది 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. సూర్యాపేట, హుజూర్‌నగర్‌ డివిజన్‌లో సోమవారం నుంచి ప్రారంభమైంది.

Updated : 29 Jun 2024 05:30 IST

పురపాలికలు, మండల కేంద్రాల్లో ఫీడర్ల పరిశీలన

సూర్యాపేటలోని ఫీడర్ల సర్వేకు ముందు సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఎస్‌ఈ పాల్‌రాజ్‌

భానుపురి, తిరుమలగిరి, న్యూస్‌టుడే: జిల్లాలోని విద్యుత్తు సిబ్బంది 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. సూర్యాపేట, హుజూర్‌నగర్‌ డివిజన్‌లో సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలోని ఐదు పురపాలికలు, 23 మండల కేంద్రాల్లో వారం పాటు డీఈలు, ఏఈల ఆధ్వర్యంలో సిబ్బంది పర్యటించి సర్వే చేపట్టనున్నారు. వీరు ప్రతి వార్డులో తిరిగి విద్యుత్తు ఫీడర్లను పరిశీలిస్తారు. ఇందుకు విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా టీజీఏఐఎంఎస్‌ యాప్‌ రూపొందించారు. సిబ్బంది సర్వే చేసిన ప్రాంతాల్లో ఫీడర్లలో ఏమైనా సమస్యలుంటే ఈ యాప్‌లో నమోదు చేస్తారు.

యాప్‌లో నమోదు ఇలా..

సర్వే వివరాల నమోదుకు విద్యుత్తు పంపిణీ సంస్థ టీజీఏఐఎంఎస్‌ యాప్‌ రూపొందించింది. సిబ్బంది పురపాలికలు, మండల కేంద్రాల్లో ఫీడరు సమస్యను ఈ యాప్‌లో నమోదు చేస్తే గూగుల్‌ మ్యాప్‌ తరహాలో వివరాలు చూపుతుంది. సిబ్బంది బదిలీ అయినా.. సర్వే వివరాలను చూసుకోవచ్చు. విద్యుత్తు శాఖకు సంబంధించిన ఆస్తుల వివరాలనూ చూపుతుంది.

తప్పనున్న వదులు తీగల సమస్య

సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి పురపాలికలతోపాటు 23 మండల కేంద్రాల్లో ఫీడర్‌ సర్వేతో వదులు తీగల(లూజూలైన్ల) సమస్య తప్పనుంది. తీగలు వదులుగా ఉంటే గాలిదుమారానికి పరస్పరం తాకి తెగిపోయే ప్రమాదం ఉంది. శిథిలావస్థకు చేరిన స్తంభాలు, నియంత్రికలనూ గుర్తించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. ఫీడర్లలో కరెంటు సరఫరా సమస్యలున్నా మరమ్మతు చేపడతారు.

వారం పాటు సర్వే

జిల్లాలోని పురపాలికలు, మండల కేంద్రాల్లో వారం పాటు సిబ్బంది ఫీడర్ల సర్వే చేయనున్నారు. ఇందులో లూజులైన్లు, ఫీడర్ల సమస్యలుంటే గుర్తించి మరమ్మతు చేపడతారు. వదులు తీగల కారణంగా విద్యుత్తు సరఫరాలో తలెత్తే ఆటంకాలన్నీ ఈ సర్వే ద్వారా తొలగిపోతాయి.

శ్రీనివాస్, డిస్కం డీఈ, సూర్యాపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని