logo

గర్భంలోనే నిండునూరేళ్లు..!

సూర్యాపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతి ఘటన జిల్లాలో లింగనిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్‌) ఎంత యథేచ్ఛగా సాగుతుందో తెలిపేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

Updated : 29 Jun 2024 05:33 IST

భ్రూణ హత్యలకు అడ్డాగా ఆసుపత్రులు..!

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతి ఘటన జిల్లాలో లింగనిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్‌) ఎంత యథేచ్ఛగా సాగుతుందో తెలిపేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో కొంత మంది వైద్య రంగంలో మాఫియాగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగు చూసినప్పుడు మాత్రమే సంబంధిత అధికారులు కొద్ది రోజులు హడావుడి చేయడం.. ఆ తర్వాత ‘చూసీ’చూడనట్లుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది.

పట్టుబడినా.. అదే దందా..!

జిల్లా కేంద్రంలోని కొన్ని ఆసుపత్రులు భ్రూణ హత్యలకు ప్రసిద్ధి చెందాయి. ఇటీవల కోదాడ ప్రాంతంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది గ్రామీణ వైద్యులు(ఆర్‌ఎంపీలు) మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకొని రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చిన్న చిన్న క్లీనిక్‌లు ఏర్పాటు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తున్నారు. ప్రత్యక్షంగా పట్టుబడినా.. జరిమానాలు విధించినా.. కేసులు నమోదు చేసినా.. వెనుకకు తగ్గడం లేదు.

  • ఏడాదిన్నర క్రితం సూర్యాపేటలోని ఓ వైద్యురాలు గర్భవిచ్చిత్తి చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆమెకు జరిమానా విధించి వదిలేశారు.
  • ఏడాది క్రితం ఎంజీ రోడ్డులోని ఓ క్లీనిక్‌లో మహిళకు గర్భవిచ్ఛిత్తి చేస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఆసుపత్రిని సీజ్‌ చేశారు.
  • అదే తరహాలో రామలింగేశ్వర థియేటర్‌ రోడ్డులోనూ మరో ప్రైవేటు ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ఆ ఆసుపత్రుల స్థానాల్లో కొత్త పేర్లతో దవాఖానాలు వెలుస్తున్నాయి.  
  • ఒకవైపు అవగాహన.. మరో వైపు ఉల్లంఘన

భ్రూణ హత్యలను నిలువరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల పీసీ-పీఎన్‌డీటీ (ప్రీ కన్‌సెప్షన్, ప్రీ నెటల్‌ డయాగ్నస్టిక్‌ టెక్నిక్స్‌) చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. అందులో భాగంగా సూర్యాపేటలోనూ ఇటీవల జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిర్వహించే స్కానింగ్‌ కేంద్రాల నిర్వహకులు, వైద్యులకు, కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ఘటనలూ వెలుగు చూడటం గమనార్హం. అధికారులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడానికే పరిమితమవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆచరణలో చేసి చూపితేనే వీటికి అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయి.

డీఎంహెచ్‌వో వివరణ కోసం ‘న్యూస్‌టుడే’ ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని