logo

రూ.లక్షల్లో జీతం.. ప్రైవేటు బాగోతం

ఆ వైద్యుడి నెల జీతం రూ.2 లక్షలకు పైగానే.. నల్గొండ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)లో విధులు. నిత్యం హైదరాబాద్‌ నుంచి జీజీహెచ్‌కు వస్తారు. ఆసుపత్రికి వచ్చేసరికే ఉదయం 11 గంటలు దాటుతుంది.

Updated : 28 Jun 2024 07:16 IST

నల్గొండ జీజీహెచ్‌లో కొంత మంది వైద్యుల తీరు

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల

ఆ వైద్యుడి నెల జీతం రూ.2 లక్షలకు పైగానే.. నల్గొండ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)లో విధులు. నిత్యం హైదరాబాద్‌ నుంచి జీజీహెచ్‌కు వస్తారు. ఆసుపత్రికి వచ్చేసరికే ఉదయం 11 గంటలు దాటుతుంది. రెండు గంటలు ఓపీ విధుల్లో ఉంటారో లేదో మధ్యాహ్న భోజన సమయానికి స్థానికంగా ప్రైవేటులో ఓపీ చూసే ఆసుపత్రికి వెళ్లిపోతారు. తిరిగి సాయంత్రం వస్తారా అంటే.. అదీ లేదు. పనితీరు మార్చుకోకుంటే ఛార్జ్‌మెమో ఇస్తామని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఉన్నతాధికారి ఆయన్ను హెచ్చరించడం గమనార్హం. 

నల్గొండ జిల్లాలోని ఓ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యురాలి నెల వేతనం రూ.3 లక్షల పైమాటే. నిత్యం నల్గొండ నుంచి సదరు ఏరియా ఆసుపత్రికి వెళ్లి విధులు నిర్వహించాలి. అయితే ఎలాంటి సమాచారం లేకుండానే సెలవులు తీసుకోవడం, నెలలో పక్షం రోజులు మాత్రమే ఆమె విధులకు హాజరవుతుండటంతో.. ఇటీవలే ఉన్నతాధికారి ఛార్జ్‌మెమో ఇస్తామని హెచ్చరించడంతో.. తనను సదరు ఉన్నతాధికారి వేధిస్తున్నారని ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధికి ఫిర్యాదు చేశారు.  

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, నల్గొండ వైద్యవిభాగం :  ‘ఆసుపత్రిలో వైద్య పరికరాలు లేవు. సరైన మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటూ వైద్యులు ఆందోళన చేయడం ఇప్పటివరకు చూసుంటాం. కానీ కలెక్టరు ఆదేశాల మేరకు కొంత మంది ప్రత్యేకాధికారులు నిత్యం ఆసుపత్రి పరిశీలనకు వస్తున్నారంటూ ఆందోళన చేయడం బహుశా నల్గొండ జీజీహెచ్‌లోనే చూస్తున్నా’మంటూ హాలియా నుంచి జీజీహెచ్‌కు ఓపీకి వచ్చిన రామస్వామి గురువారం జరిగిన ఆందోళనపై అభిప్రాయపడటం ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో జరిగిన ఘటన వైద్యులు వర్సెస్‌ జిల్లా యంత్రాంగంగా మారింది. కొంత మంది వైద్యుల పనితీరు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన వినిపిస్తోంది. పలుమార్లు హెచ్చరించినా సీనియర్‌ వైద్యులతో పాటూ ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న వారి పనితీరు మారడం లేదని..వారిని విధులు సరిగ్గా నిర్వర్తించమని ఆదేశిస్తే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తున్నారని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రైవేటు ఓపీకే మొగ్గు 

జీజీహెచ్‌లో ప్రస్తుతం 220కి పైగా వైద్య పోస్టులకు ప్రభుత్వం అనుమతించగా..స్పెషలిస్టు వైద్యులతో పాటూ కొన్ని సైంటిస్టు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అత్యధికులు విధుల నిమిత్తం హైదరాబాద్‌ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంత మంది వైద్యులు సైతం వారి ప్రైవేటు క్లినిక్‌లలో ఓపీలు చూడటానికే ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది వైద్యుల వల్ల చాలా మంది వైద్యులకు చెడ్డపేరు వస్తుందన్న అభిప్రాయమూ అంతర్గతంగా వ్యక్తమవుతోంది. చాలా మంది వైద్యులు ఉదయం ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్‌ వేసి తిరిగి ప్రైవేటు ఓపీలకు వెళ్లిపోతున్నారు. ఇటీవల కలెక్టర్‌ తొలిసారి జీజీహెచ్‌ను సందర్శించిన సమయంలోనూ చాలా మంది వైద్యులు విధుల్లో లేకపోగా..ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని నిత్యం పర్యవేక్షించే ఉన్నతాధికారులకు వైద్యులపై పట్టులేకపోవడం, ఉన్నతాధికారులు చేసే అక్రమాలకు కొంత మంది వైద్యులు సహకరిస్తుండటంతో అంతిమంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయానికొచ్చిన కలెక్టర్‌ నారాయణరెడ్డి.. ఆసుపత్రిలో జిల్లా స్థాయి అధికారులతో పరిశీలన చేయాలని ఆదేశించడం ఆందోళనకు కారణమైంది.

మెరుగైన వైద్య సేవలకే పరిశీలన 

ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలకే కలెక్టరు ప్రత్యేకాధికారులను పరిశీలనకు పంపుతున్నారు. తమకంటే తక్కువ క్యాడర్‌ అధికారులు ఆసుపత్రిని ఎలా పరిశీలన చేస్తారని కొంత మంది వైద్యులు అభ్యంతరం చెబుతున్నారు. కేవలం కలెక్టరు, అదనపు కలెక్టర్లకు మాత్రమే ఆసుపత్రి పరిశీలన అధికారాలున్నాయని వారి వాదన. ఆసుపత్రి నిర్వహణకు సూపరింటెండెంట్‌ ఉన్నారని..ఇంకా ప్రత్యేకంగా నిత్యం పరిశీలన ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వారి వాదనలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 

డాక్టర్‌ నిత్యానందం, జీజీహెచ్‌ సూపరింటెండెంట్, నల్గొండ 

నియంత్రణకు అధికారం ఇవ్వలేదు 

జీజీహెచ్‌లో పనిచేసే వైద్యులను నియంత్రించాలని మేం ఎవరికి అధికారం ఇవ్వలేదు. కేవలం ఆసుపత్రిలో మౌలిక వసతులు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, భోజనం నాణ్యత తదితర అంశాలను నిత్యం పరిశీలించి నివేదిక ఇవ్వాలని మాత్రమే సూచించాం. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మేలైన వైద్యం అందించాలన్నదే అధికార యంత్రాంగం తపన. 

సి.నారాయణరెడ్డి, కలెక్టరు, నల్గొండ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని