logo

వ్యాపారంలో రాణించాలని

స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ కార్యక్రమాల ద్వారా చేయూతనిస్తోంది. తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ వివిధ వ్యాపారాల్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తోంది.

Published : 26 Jun 2024 02:49 IST

సూర్యాపేట: కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరైన అధికారులు, మండల సమాఖ్య అధ్యక్షురాళ్లు

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ కార్యక్రమాల ద్వారా చేయూతనిస్తోంది. తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ వివిధ వ్యాపారాల్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తోంది. తాజాగా ‘మహిళా శక్తి’ పేరిట కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా అతివలకు వివిధ వ్యాపారాల్లో శిక్షణ అందించడమే కాకుండా అందుకు కావాల్సిన రుణాలు అందించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. రుణ పంపిణీ లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా అంశాలపై అధికారులకు అవగాహన కల్పించింది. 

27,271 యూనిట్లు కేటాయింపు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు 58,170 ఉండగా అందులో సభ్యులైన మగువలు ఆర్థికంగా స్థిరపడేలా చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. అందులో భాగంగా వారికి 14 రకాల వ్యాపారాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు 27,271 యూనిట్లు నెలకొల్పనుంది. అందుకు రూ.271 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం గుర్తించి ఆ నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి డీపీఎం, ఏపీఎం, సీసీలు, మండల సమాఖ్య అధ్యక్షురాళ్లు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. మండలాలు, క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి, యూనిట్ల గురించి చెబుతున్నారు. శిక్షణ అనంతరం  లబ్ధిదారుల ఎంపికలో అధికారులు కీలకంగా వ్యవహరించాలని జిల్లా ఉన్నతాధికారులు సూచించారు. యూనిట్‌ గ్రౌండింగ్‌కు సత్వర చర్యలు తీసుకుని బ్యాంకుల సమన్వయంతో ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించారు.

14 రకాల అంశాలపై శిక్షణ

మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 14 రకాల వ్యాపారాలు ఎంపిక చేసి వాటిపై శిక్షణ ఇప్పించి అనంతరం వ్యాపారాలు నెలకొల్పేందుకు తక్కువ వడ్డీతో రుణాలు కూడా మంజూరు చేయనున్నారు. ఇప్పటికే తొలుత విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టే పనిని ప్రభుత్వం మహిళలకు అప్పగించింది. ఈ పని మెరుగైన ఫలితాలను ఇచ్చింది. మిగిలిన 13 రకాల అంశాలలో భాగంగా మైక్రో ఎంటర్‌ప్రైజెస్, కుట్టు కేంద్రాలు, పాడి పశువులు, పెరటికోళ్ల పెంపకం, సంచార మత్స్య విక్రయకేంద్రాలు(అవుట్‌లెట్లు), మిల్క్‌ ప్యాలెస్, మీ సేవా, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, మహిళా క్యాంటీన్లు, సౌర యూనిట్లు, ప్లాస్టిక్, ఆహారశుద్ధి, కస్టం హైరింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపడుతోంది. దీనిపై ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని