logo

నకిలీ బంగారం పెట్టి రూ.53.89 లక్షల రుణం

నకిలీ బంగారు ఆభరణాలు బ్యాంక్‌లో కుదువబెట్టి రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్‌ అప్రయిజర్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌ చేశారు.

Published : 26 Jun 2024 02:32 IST

హుజూర్‌నగర్‌లో అరెస్టు చేసిన నిందితులతో సీఐ చరమంద రాజు, సిబ్బంది

హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నకిలీ బంగారు ఆభరణాలు బ్యాంక్‌లో కుదువబెట్టి రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్‌ అప్రయిజర్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌ చేశారు. సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన కేశవరపు రాజేష్‌ బంగారు ఆభరణాలు తయారు చేయడం నేర్చుకొని మిర్యాలగూడలో రాజేష్‌ గోల్డ్‌ వర్క్స్‌ పేరుతో దుకాణాన్ని పెట్టాడు. దుకాణంతో నష్టం రావడంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, నెల్లూరులో నకిలీ బంగారు ఆభరణాలు తయారు చేయించి,  ఎవరికి అనుమానం రాకుండా ఆయా ఆభరణాలపై హాల్‌ మార్కు కేడీఎం 916 ముద్ర వేయించాడు. గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పని చేస్తున్న గోల్డ్‌ అప్రయిజర్‌ జిల్లేపల్లి నరేందర్‌తో గల పాత పరిచయాలతో..ఒప్పందం చేసుకున్నారు.నకిలీ ఆభరణాలు బంగారమని ధ్రువీకరిస్తానని  నరేందర్‌ ఒప్పుకోవడంతో కొంత బంగారాన్ని రాజేష్‌ తన పేరుతో, మరి కొంత భార్య వర్షిత పేరుతో రుణాలు తీసుకున్నాడు. రాజేష్‌ బంధువులైన చింతకుంట్లకు చెందిన కొమెరపూడి వెంకటాచారి, వైకుంఠపురం గ్రామానికి చెందిన కణితి సాయిరాం, మాడ్గులపల్లి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన మిత్రులు అర్రగొర్ల పరశురాములు, మిర్యాలగూడెంకు చెందిన దోనేటి ముఖేష్, సూర్యాపేట శ్రీనగర్‌ కాలనీకి చెందిన మోత్కూరి సూర్యతో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి గత నెల 2వ తేదీ నుంచి దఫాల వారీగా ఒక్కొక్కరిని తీసుకెళ్లి మొత్తం రూ.53,89,000 రుణాలు తీసుకున్నాడు. బ్యాంక్‌ అధికారులు బ్యాంక్‌లో జరిగే ఆడిట్‌ కోసం.. వేరే శాఖలో పనిచేస్తున్న గోల్డ్‌ అప్రయిజర్‌తో తనిఖీలు చేయిస్తుండగా విషయం బయట పడింది. దీంతో బ్యాంక్‌ మేనేజర్‌ మేడబోయిన శ్రీకాంత్‌ ఆ బ్యాంక్‌ ఉన్నతాధికారులకు తెలియజేసి వారి సలహా మేరకు గరిడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఈనెల 21న ఫిర్యాదు చేశారు. కేసు విషయంలో దర్యాప్తు చేస్తుండగా నమ్మదగిన సమాచారం రావడంతో ఏ-1గా ఉన్న కేశవరపు రాజేష్‌ స్వగ్రామం వైకుంఠపురంలో మంగళవారం అందరిని అరెస్టు చేశామన్నారు. వీరందరినీ హుజూర్‌నగర్‌ న్యాయస్థానంలో హాజరు పరిచామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని