logo

అంతర పంటల సాగుపై అవగాహన కల్పించాలి

పండ్ల తోటల్లో అంతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారి హన్మంతు కె.జెండగే సూచించారు. మండల కేంద్రంలోని స్వరణ్‌పాల్‌సింగ్‌ వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.

Published : 26 Jun 2024 02:26 IST

రాజపేటలో మామిడితోటలో అంతర పంటగా ఉన్న కూరగాయల సాగును పరిశీలిస్తున్న జిల్లా పాలనాధికారి హన్మంతు కె.జెండగే

రాజపేట, న్యూస్‌టుడే: పండ్ల తోటల్లో అంతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారి హన్మంతు కె.జెండగే సూచించారు. మండల కేంద్రంలోని స్వరణ్‌పాల్‌సింగ్‌ వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. మామిడితోటలో అంతర పంటలుగా మిరప, టమాట, సోర లాంటి కూరగాయల సాగును పరిశీలించారు. ముఖ్యంగా గో ఆధారిత సేంద్రియ సాగును చేపడుతున్న రైతు స్వరణ్‌పాల్‌ సింగ్‌ను అభినందించారు. సాగుకు పెట్టుబడి, విక్రయం, వచ్చిన లాభం వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలసాయం పొందుతున్న స్వరణ్‌పాల్‌సింగ్‌ వ్యవసాయ క్షేత్రాన్ని ఔత్సాహిక రైతులు సందర్శించి స్ఫూర్తి పొందేలా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, యాదగిరిగుట్ట ఏడీఏ పద్మావతి, వ్యవసాయాధికారి మాధవి, అజయ్‌పాల్‌సింగ్, ఎర్రోళ్ల బాబు పాల్గొన్నారు. 

అర్థవంతమైన రైతుభరోసాను అందిస్తాం.. మంత్రి తుమ్మల

రైతుల ద్వారా సలహాలు, సూచనలు స్వీకరించి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అర్థవంతమైన రైతుభరోసా, రుణమాఫీ పథకాలు అమలు చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికల ద్వారా మంగళవారం దృశ్య శ్రవణ విధానం(రైతునేస్తం)తో రైతులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హన్మంతు కె.జెండగే, జిల్లా వ్యవసాయాధికారి అనురాధలతో పాటు అధికారులు, రైతులు హాజరయ్యారు. రాష్ట్ర ప్లానింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ చిన్నారెడ్డి, వ్యవసాయ కమిషన్‌ కోదండరెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రెటరీ రఘునందన్‌రావు, శాస్త్రవేత్తలతో కలిసి రైతులతో ముఖాముఖీ కార్యక్రమం చేపట్టారు. సాగులో పత్తి విత్తనాలు నాటుకోవచ్చని, రానున్న రోజుల్లో వర్ష సూచనలున్నాయని శాస్త్రవేత్తలు సూచించారు. ముఖ్యంగా విత్తనశుద్ధి చేపడితే చీడపీడల నివారణ కొంతమేర తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. రైతుభరోసా వర్తింపునకు ఐటీ లాంటి నిబంధనలు సవరించాలని, పదెకరాల వరకు పరిగణలోకి తీసుకుని, సాగు చేసేవారికే వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని రైతులు సూచించారు. ఎంపీపీ బాలమణి, ఎంపీటీసీ సభ్యుడు రాజు, ఏడీఏ పద్మావతి, ఉద్యానవనశాఖ అధికారి సైదులు, వ్యవసాయాధికారి మాధవి, గౌటె లక్ష్మణ్, మేక వేంకటేశ్వర్‌రెడ్డి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు