logo

తనిఖీ చేస్తా.. అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తా: కలెక్టర్‌

ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ వైద్య అధికారులను ఆదేశించారు.

Published : 26 Jun 2024 02:22 IST

కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

కోదాడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ వైద్య అధికారులను ఆదేశించారు. పట్టణంలోని సామాజిక వైద్యశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. జనరల్‌ వార్డు రూమ్, ఎక్స్‌రే, ప్రయోగశాలను, ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు. నిత్యం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ఓపీ సంఖ్యను రికార్డుల్లో తనిఖీ చేశారు. డయాలసిస్‌ యూనిట్‌ను పరిశీలించి రోజుకు ఎంత మంది వస్తున్నారు, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రసూతి వార్డుల్లో పర్యటించి మహిళలను ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలపగా త్వరలోనే వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
షాదీఖానా, ఈద్గా స్థలాల పరిశీలన: పట్టణంలో నిర్మించే ఈద్గా కోసం రూ.2 కోట్లు, షాదీఖానాకు రూ.3 కోట్లు మంజూరు కావడంతో వీటిని నిర్మించేందుకు సాలార్జంగ్‌పేటలోని పలు స్థలాలను కలెక్టర్‌ పరిశీలించారు. త్వరలోనే స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణాలు చేపడతామని తెలిపారు. 

ఉపాధ్యాయులపై అసహనం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఆయన, అక్కడ ఉపాధ్యాయులు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల చేరికలో ఎందుకు వెనుకబడ్డారని, విద్యార్థులు ఎక్కువ మంది చేరేలా క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తానని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని విద్య, వైద్య సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో పుర ఛైర్‌పర్సన్‌ సామినేని ప్రమీల, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దశరథ, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంఈవో షరీఫ్, పుర వైస్‌ ఛైర్మన్‌ కోటేశ్వరరావు, తహసీల్దార్‌ సాయగౌడ్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని