logo

ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్‌

జిల్లాలో ఇసుక, చెరువుల్లో మట్టి అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 26 Jun 2024 02:13 IST

దూరదృశ్య శ్రవణ సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి 

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: జిల్లాలో ఇసుక, చెరువుల్లో మట్టి అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో ఇసుక, చెరువుల్లో ఒండ్రుమట్టి, మొరం అక్రమ రవాణ, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్‌ నుంచి ఆయన దూరదృశ్య శ్రవణం ద్వారా మాట్లాడారు. జిల్లాలో పెద్దఎత్తున ఇసుక, మొరం, ఒండ్రుమట్టి అక్రమ రవాణా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు వివరించారు. వాటిని అరికట్టేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలోని బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. డివిజన్‌ స్థాయిలో ఆర్డీవో, డీఎస్పీ, డీపీవో, ఇరిగేషన్‌ అధికారులు, పుర కమిషనర్లుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, స్థానిక ఎస్సై, నీటిపారుదల ఇంజినీర్‌లు ఈ బృందంలో ఉంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, అదనపు ఎస్పీలు, అదనపు కలెక్టర్‌లతో కమిటీగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇసుక అవసరం ఉన్నవారు మన ఇసుక వాహనం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరిగితే సంబంధిత బృందాలపైన, బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో చెరువుల నుంచి అక్రమంగా ఒండ్రుమట్టి తరలింపును తక్షణమే నిలిపివేయాలన్నారు. అక్రమంగా తరలించే వాహనాలకు పెనాల్టీ వేయకుండా కోర్టుకు అప్పగిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ విషయంలో సైతం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. మన ఇసుక వాహనం ద్వారా అనుమతి తీసుకునేందుకు మండల స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలతో పాటు కేసు నమోదు చేస్తామన్నారు. మండల, డివిజన్‌ కేంద్రాల్లో పోలీసులు అప్రమత్తతో ఉండాలన్నారు. ఈ విషయంలో రెవెన్యూ, ఇతర యంత్రాంగాలకు సహకరించాలని కోరారు. అదనపు కలెక్టర్లు టి.పూర్ణచంద్ర, జె.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


పెండింగ్‌ భూ సేకరణ పూర్తిచేయండి

నల్గొండ కలెక్టరేట్‌: ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో భూసేకరణ, పునరావాస కేంద్రాలపై రెవెన్యూ, నీటిపారుదల, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రత్యేకించి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ఎక్కడ పెండింగ్‌లో ఉండకుండా చూసుకోవాలన్నారు. మొదటి ప్రాధాన్యతతో వాటిని పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్‌ కారణంగా ఆగిపోయిన పనులన్నింటినీ వెంటనే మొదలుపెట్టి పూర్తి చేయాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు