logo

ఉపాధి కోర్సులకు ఆదరణ కరవు

పారిశ్రామిక శిక్షణా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తలుపుతడుతున్నాయి. తక్కువ సమయంలో కొలువులు సాధించి.. స్థిరపడాలనుకునే యువతకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) చక్కటి అవకాశం కల్పిస్తోంది.

Published : 03 Jul 2024 02:35 IST

ఐటీఐలో ప్రవేశాలు అంతంత మాత్రమే

మెదక్‌ ఐటీఐ

మెదక్‌ అర్బన్, న్యూస్‌టుడే: పారిశ్రామిక శిక్షణా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తలుపుతడుతున్నాయి. తక్కువ సమయంలో కొలువులు సాధించి.. స్థిరపడాలనుకునే యువతకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) చక్కటి అవకాశం కల్పిస్తోంది. ఐటీఐల్లో డ్యూయల్‌ సిస్టమ్‌ ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌(ఓజేటీ)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తరగతులకు హాజరవుతూనే పరిశ్రమల్లో ప్రయోగాత్మక శిక్షణకు వెళ్లి సంపాదించుకోవచ్చు. పనిచేసే క్రమంలో వచ్చే సందేహాలను అధ్యాపకులు నివృత్తి చేస్తారు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఐటీఐ కోర్సులపై అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

136 సీట్లకు 36 భర్తీ: జిల్లా పరిధిలో మెదక్‌లోనే ఏకైక ప్రభుత్వ ఐటీఐ ఉండగా, ప్రైవేటులో 9 ఉన్నాయి. ఐటీఐలో ప్రథమ సంవత్సరానికి 136 సీట్లు కేటాయించారు. మే 16 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు తొలి విడత ప్రవేశాల్లో 36 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రైవేటు సంస్థల్లో సగం కూడా నిండలేదు. రెండో విడత ప్రవేశాలను త్వరలో నిర్వహించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు https://iti.telangana.gov.in వెబ్‌సైట్లో ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్‌ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. బాలికలకు 33శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

మరో విడతపైనే ఆశలు..: 136 సీట్ల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారిలో మెరిట్‌ ఆధారంగా 120 మందికి సీట్లు కేటాయించగా.. కేవలం 36 మంది ప్రవేశాలు పొందారు. దీంతో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. రెండో విడత ప్రవేశాలపైనే కళాశాలల యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి. 

ఇవీ కారణాలు.. : గతంలో ఐటీఐ పరీక్షలు రాత పద్ధతిలో జరిగేవి. మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లో చేరుతున్న వారిలో అత్యధికులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారే కావడంతో కంప్యూటర్‌ పరిజ్ఞానం తక్కువగా ఉండటం, పరీక్షలు ఆంగ్లంలోనే రాయాల్సి రావడంతో ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. మరోవైపు ఐటీఐ చదివితే పరిశ్రమల్లో పని చేయాల్సి ఉంటుంది. అదే ఇంటర్‌ చదివి సాఫ్ట్‌వేర్‌ కోర్సులు పూర్తి చేస్తే ఎక్కువ వేతనాలు పొందవచ్చనే ఉద్దేశంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు. పరిశ్రమల్లో శిక్షణకు ఇంకా పాత యంత్రాలు వినియోగిస్తుండటంతో నైపుణ్యాలు పెంచుకోలేని పరిస్థితి.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా : ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఇకపై నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారనున్నాయి. ఆధునిక సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌(టీటీఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. యువతకు ఉపాధి మార్గాలు పెంచేలా ఆధునిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. నూతన భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించి, ఉపకరణాలు సమకూర్చి నూతన కోర్సులు నేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


వేల సంఖ్యలో ఉద్యోగాలు

- పి.చంద్రశేఖర్రావు, ఐటీఐ ప్రిన్సిపల్, మెదక్‌

సత్వర ఉపాధికి ఐటీఐ ఎంతో దోహదపడుతుంది. కేంద్రంలో అప్రెంటిస్‌ మేళాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏటా వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడానికి దోహదం చేస్తాయి. ఆసక్తి ఉన్న వారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని