logo

బీమా లేదు.. పరిహారం రాదు

మెదక్‌ పురపాలికలో చెత్త తరలించే ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో ట్రాలీలకు కనీసం బీమా చేయించడం లేదు. నిత్యం రహదారులపై తిరిగే వాహనాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజలు నిలదీస్తున్నారు.

Published : 03 Jul 2024 02:34 IST

పారిశుద్ధ్య వాహనాల నిర్వహణపై పుర అధికార నిర్లక్ష్యం

ట్రాక్టర్‌లో చెత్తను తరలిస్తున్న సిబ్బంది

మెదక్‌ టౌన్, న్యూస్‌టుడే: మెదక్‌ పురపాలికలో చెత్త తరలించే ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో ట్రాలీలకు కనీసం బీమా చేయించడం లేదు. నిత్యం రహదారులపై తిరిగే వాహనాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజలు నిలదీస్తున్నారు. ఇతర వాహనాల విషయంలోనూ బీమా చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

అనుభవంలేని వారు: మెదక్‌ పురపాలిక పరిధిలో 32 వార్డుల్లో చెత్త సేకరణకు 17 స్వచ్ఛ ఆటో ట్రాలీలను, ట్రాక్టర్లును కేటాయించారు. మొదట్లో ఈ వాహనాలను నడిపే 17 మందిలో కేవలం ఆరుగురికి మాత్రమే లైసెన్స్‌లు ఉండేవి. వారికి సరైనా అనుభవం లేకపోవడంతో ఇష్టానుసారంగా వాహనాలను నడిపారు. వాస్తవానికి వారికి లైసెన్స్‌తో పాటు బ్యాడ్జీలు తప్పనిసరిగా ఉండాలి. గత ఏడాది ఒక వాహనం ప్రమాదానికి గురికావడంతో శానిటరీ అధికారి మహేశ్‌.. లైసెన్స్‌ ఉన్నవారినే విధుల్లోకి తీసుకుంటామని అనడంతో ఇటీవల తీసుకున్నారు. ఇంకా బ్యాడ్జీ నంబర్‌ లేని వారు చాలానే ఉన్నారు. కౌన్సిలర్లు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

నిలువెత్తు సాక్ష్యం: గత శీతాకాలంలో కురిసిన మంచులో దారి కనిపించక ఆటో ప్రమాదానికి గురై పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం ఆ ఆటో మరమ్మతుకు రూ.2,47,612 ఖర్చు అవుతుందని చూపారు. అదే బీమా చేయించి ఉంటే ఈ మొత్తం ఖర్చులో అన్ని వాహనాలకు బీమా ప్రీమియం పూర్తి అయ్యేది. గత 7 నెలల నుంచి ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకోవడంతో అదనంగా రూ.2,14,800 ఖర్చు అయింది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారని ఇటీవల పుర అధికారులపై ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌ గౌడ్, కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సైతం అన్ని వాహనాలకు బీమా చేయించాలని ఆదేశించినా.. ఎందుకు చేయించలేదని పుర అధ్యక్షుడు చంద్రపాల్‌ ప్రశ్నించారు. థర్డ్‌ పార్టీ బీమా వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా పురపాలిక అధికారులు అలసత్వాన్ని వీడి క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


ఇంజినీరింగ్‌ అధికారులకు రాశారు

- మహేశ్, శానిటరీ అధికారి

పాలకవర్గం సభ్యుల ఆదేశాల మేరకు పురపాలికలో ఉన్న 17 వాహనాలకు బీమా చేయించాలని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే స్పందించి ఇంజినీరింగ్‌ విభాగానికి లేఖ రాశారు. వారి నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని