logo

అమ్మ లాలన.. మొక్క రక్షణ

అమ్మ.. నవమాసాలు మోస్తుంది. పురిటినొప్పులు భరిస్తూనే శిశువుకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమి ఆశించక పెంచి పెద్ద చేస్తుంది. జీవితంలో తన కుమారుడి ఎదుగదలను చూసి.. ఆనందాన్ని పొందుతుంది.

Published : 03 Jul 2024 02:31 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట, మెదక్‌ టౌన్, సంగారెడ్డి టౌన్, వికారాబాద్‌ మున్సిపాలిటీ

అమ్మ.. నవమాసాలు మోస్తుంది. పురిటినొప్పులు భరిస్తూనే శిశువుకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమి ఆశించక పెంచి పెద్ద చేస్తుంది. జీవితంలో తన కుమారుడి ఎదుగదలను చూసి.. ఆనందాన్ని పొందుతుంది. తనువు చాలించే వరకు బాధలను దిగమింగుకొని పిల్లలపై ప్రేమ కురిపిస్తుంది. అమ్మ రుణం ఆ జన్మాంతం తీర్చుకోలేనిది.

వృక్షం.. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తుంది. కొన్ని రోజులు కాపాడితే.. వెలకట్టలేని ప్రాణవాయువును ఇస్తుంది. ఎదిగిన కొద్దీ పండ్లు, పూలు.. వివిధ రూపాల్లో ఆహారాన్ని అందిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వానలు కురవడంలోనూ కీలకమే. నేలకొరిగాక కూడా ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంటాయి. వీటికి జీవ జాతులు రుణపడి ఉంటాయనడంలో సందేహం లేదు.

మ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో ఏటా హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం ఉద్యమంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు వివిధ రకాల సందర్భాల్లో వ్యక్తిగతంగా మొక్కలు నాటుతున్నారు. జన్మదిన వేడుకల్లో నాటేందుకు అత్యధికులు ఆసక్తి చూపుతున్నారు. వివిధ అభివృద్ధి, ప్రగతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్క నాటడం ఓ ఆనవాయితీగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. చిన్నపాటి వనాలను హరితమయంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రీన్‌ ఛాలెంజ్, వృక్షాబంధన్‌ కార్యాక్రమాల నిర్వహణ సహా వివిధ శుభాకార్యాల్లో మొక్కల పంపిణీ చేపడుతున్నారు. స్ఫూర్తిని రగిలించేలా.. రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో సవాళ్లు విసురుతున్నారు. ఈ స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.


‘పర్యావరణం.. ఎల్లప్పుడూ మానవహితాన్ని కాంక్షిస్తుంది. వృక్షాలతో అందరికీ ఉపయోగమే. పర్యావరణ స్ఫూర్తిని చాటేలా అమ్మ పేరిట ఒక మొక్క నాటండి. ఇదో ఉద్యమంలా సాగాలి. తాను తన తల్లి స్మారకార్థం మొక్క నాటాను. భూమాతను రక్షించేందుకు సహాయపడాలి.’

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి (ఆదివారం జరిగిన మన్‌కీ బాత్‌లో..)


నది ఎండటం చూసి..

అయోధ్యలో అమర్‌నాథ్‌ అన్నదాన సేవాసమితి బాధ్యులతో కలిసి మొక్క నాటుతున్న జ్ఞానేశ్వర్‌

నారాయణఖేడ్‌: సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్దా మండలం ముక్టాపూర్‌కు చెందిన యువకుడు పాలడుగు జ్ఞానేశ్వర్‌ పదేళ్లకిందట తీవ్ర వర్షాభావంతో స్వగ్రామం పక్కన ఉన్న మంజీరానది ఎండిపోవడం, పక్షులు మృత్యువాత పడటం చూసి చలించారు. అప్పట్లోనే మొక్కలు నాటాలని సంకల్పించుకున్నారు. పదేళ్లలో పలు ప్రాంతాల్లో 3 లక్షల వరకు మొక్కలు నాటడమే కాకుండా ప్రజలు, విద్యార్థులతో నాటించారు. పాదయాత్ర, సైకిల్‌యాత్రలతో పర్యావరణ ఆవశ్యకతను వివరించారు. అయోధ్యలో బాలరాముడి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా పలు సంఘాల బాధ్యులతో కలిసి మొక్కలు నాటారు. ప్రస్తుతం లక్ష విత్తన బంతుల తయారీలో నిమగ్నమయ్యారు.


38 ఏళ్ల క్రితమే శ్రీకారం

జహీరాబాద్‌ అర్బన్, కోహీర్‌: అశోకుడు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించాడని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఇదే స్పూర్తితో 38 ఏళ్ల క్రితమే మొక్కలు నాటే కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా చేపట్టి ఆదర్శంగా నిలిచారు సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం గొడిగార్‌పల్లికి చెందిన మాజీ సర్పంచి విశ్వమోహన్‌. గొడిగార్‌పల్లి, బడంపేట, గొడిగార్‌పల్లితండా గ్రామాల్లో 3 వేలకు పైగా మొక్కలు నాటించగా.. ఇప్పుడు పచ్చదనం సంతరించుకుంది. రహదారుల పక్కడ వృక్షాలుగా ఎదిగి హరితశోభితంగా కనిపిస్తున్నాయి.


కళాశాలలో బొటానికల్‌ గార్డెన్‌

జహీరాబాద్‌ అర్బన్‌: తల్లి స్మారకార్థం అమ్మ పేరిట బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసి వన మహోత్సవానికి తోడ్పాటు అందించారు సంగారెడ్డి బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ అరుణాబాయి. 2014లో జహీరాబాద్‌ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు. ఆ సమయంలో సొంతంగా తల్లి హమినిబాయి పేరిట బొటానికల్‌ గార్డెన్‌ను ఏర్పాటుచేయించారు. ఇప్పుడది ఆహ్లాదాన్ని పంచుతూనే విద్యార్థులకు ఉపయుక్తంగా మారింది.


బహుమతిగా అందిస్తూ..

జిన్నారం: విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, ప్రజానాయకుల పుట్టినరోజు నాడు సాధారణంగా బహుమతులు అందిస్తుంటారు. కానీ జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా పని చేసి తాజాగా సింగూరుకు బదిలీ అయిన సత్యం పైసా మొక్కను బహుమతిగా అందిస్తుంటారు. పదేళ్లుగా ఇదే విధానంలో ముందుకు సాగుతుండటం విశేషం. మొక్క ఇచ్చి వదిలేయడమే కాకుండా వీలున్నప్పుడల్లా దాని సంరక్షణపై ఆరా తీస్తుంటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.


అడవిని సృష్టించి..

వర్గల్‌: వర్గల్‌ మండలం సింగాయపల్లిలో అడవిని సృష్టించారు. 2019లో 5 హెక్టార్లలో మియావాకి విధానంలో 50 వేల మొక్కలు నాటగా వాటిని సంరక్షించడంతో ఇప్పుడవన్నీ పెరిగి పచ్చదనం సంతరించుకున్నాయి. అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఇప్పుడక్కడ పరిస్థితిలో మార్పు వచ్చింది. దీని చుట్టూ 5.2 కి.మీ. మేర కంచె వేసి రక్షణ కల్పించారు. వేసవిలోనూ గుంతలు తవ్వించి నీటి నిల్వకు ఢోకా లేకుండా చేశారు. అటవీ అధికారులు అన్ని చర్యలు తీసుకొని తడులు అందించి సంరక్షించారు.


మహిళల చేతుల్లో..

గుమ్మడిదల: అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు కొత్త పద్ధతితో ముందుకు సాగారు. గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో స్వయం సహాయక సంఘం సభ్యులు విత్తన బంతులు తయారుచేశారు. ఎరువుల మిశ్రమంతో కూడిన మట్టిలో పండ్లు తదితర విత్తనాలను చేర్పించారు. వాటిని మంబాపూర్‌ అడవిలో వెదజల్లారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని