logo

ఆనందం అంతలోనే పెను విషాదం

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. ఏ ఆనందమైనా, విషాదమైన కలిసే పంచుకున్నారు.. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అందరూ కలిసి ఉత్సాహంగా పర్యటక ప్రాంతాలను చూసి వద్దామని బయలు దేరారు.

Published : 03 Jul 2024 02:26 IST

పుణె రోడ్డు ప్రమాదంలో అయిదుగురి మిత్రుల దుర్మరణం

ప్రమాదానికి గురైన కారు

నారాయణఖేడ్, నారాయణఖేడ్‌ రూరల్‌: చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. ఏ ఆనందమైనా, విషాదమైన కలిసే పంచుకున్నారు.. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అందరూ కలిసి ఉత్సాహంగా పర్యటక ప్రాంతాలను చూసి వద్దామని బయలు దేరారు. తిరుగు ప్రయాణంలో వారి అన్యోన్యతను చూసి.. విధికి కన్ను కుట్టిందేమో ప్రమాదం రూపంలో వారిలో కొందరిని కబలించింది. మరొకరిని గాయాలపాలు జేసింది. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.    
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు యువకులు (27 ఏళ్లలోపు వారు) ఆదివారం కారులో రాజస్థాన్‌ అజ్‌మేరా దర్గాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా మంగళవారం మహారాష్ట్ర పుణే వద్ద కారు టైరు పేలిన ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సయ్యద్‌ అమర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాద సమాచారం తెలిసి కుటుంబ సభ్యులు రోదనలో మునిగిపోయారు. ఖేడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతులు రఫిక్, ఫిరోజ్‌

తండ్రికోసం వచ్చి

నారాయణఖేడ్‌కు చెందిన మహబుబ్‌ ఖురేషి గత కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రి యాదుల్‌ ఖురేషి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, చికిత్స చేయించేందుకు నెల కిందట ఖేడ్‌కు వచ్చాడు. అనంతరం మిత్రులతో కలిసి యాత్రకు వెళ్లి ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు. 

పుణెలో చికిత్స పొందుతున్న సయ్యద్‌ అమర్‌

కుటుంబాలకు అండగా..

ఖేడ్‌కు చెందిన రఫీక్‌ ఖురేషి సిర్గాపూర్‌లో, కంగ్టికి చెందిన ఫిరోజ్‌ ఖురేషి కంగ్టిలో మటన్‌ దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఖేడ్‌కు చెందిన ఫిరోజ్‌ ఖురేషి హైదారాబాద్‌లో చిరు వ్యాపారం చేసుకుంటు జీవనం కొనసాగిస్తున్నాడు. తీవ్రంగా గాయపడిన నారాయణఖేడ్‌ మండలం వెంకటపూర్‌కు చెందిన సయ్యద్‌ అమర్‌ డ్రైవింగ్‌ చేయడంతో పాటు, ఖేడ్‌లోని మటన్‌ దుకాణంలో పని చేస్తున్నాడు. వీరంతా చిరువ్యాపారాలతో కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వీరికి వివాహం కాలేదు. కంగ్టికి చెందిన ఫిరోజ్‌కు రెండేళ్ల కిందట వివాహం అయింది. హైదరాబాద్‌ బోరబండకు చెందిన ఫిరోజ్‌ ఖురేషికి భార్య, కుమారుడు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని