logo

చైతన్యం తీసుకొచ్చి.. భూసారం పరీక్షించి..

భూసారంపై సరైన అవగాహన లేక ఎంతోమంది రైతులు పరీక్ష చేయించకుండానే పంటలు సాగు చేసి నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి.

Published : 03 Jul 2024 02:24 IST

జహీరాబాద్‌ కేవీకేకు జోనల్‌ స్థాయిలో మూడో స్థానం
న్యూస్‌టుడే, జహీరాబాద్‌

మట్టి సేకరణపై అవగాహన కల్పిస్తూ..

భూసారంపై సరైన అవగాహన లేక ఎంతోమంది రైతులు పరీక్ష చేయించకుండానే పంటలు సాగు చేసి నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఇదే క్రమంలో జహీరాబాద్‌లోని డీడీఎస్‌-కేవీకే ఆధ్వర్యంలో రైతుల్లో భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. మూడేళ్లుగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి మట్టి పరీక్షలు చేపట్టడంతో 2023-24వ సంవత్సరానికి సంబంధించి నాలుగు రాష్ట్రాలతో కూడిన జోనల్‌ స్థాయిలో మూడో స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.

రెండు దశబ్ద్దాలుగా..

దుక్కి దున్నడం నుంచి పంట కోతకు వచ్చే వరకు రైతులకు అవసరమైన తోడ్పాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండున్నర దశబ్దాల క్రితం కృషి విజ్ఞాన కేంద్రాలను (కేవీకే) నెలకొల్పింది. జహీరాబాద్‌లో దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సహకారంతో కేవీకేను ఏర్పాటుచేయగా.. కర్షకులకు అండగా నిలుస్తోంది. సేంద్రియ సాగు, కుటీర పరిశ్రమలు, సస్యరక్షణ, ఉద్యాన పంటల సాగుతో పాటు భూసార పరీక్షలకూ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి కేవీకేకు ప్రభుత్వం ఏటా నిర్వహించాల్సిన పరీక్షలపై లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది.

2,518 పరీక్షలు..

కేవీకే పరిధిలోని గ్రామాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేశారు. జనవరి నుంచి మే చివరి వరకు పరీక్షించడానికి అనువు. నాలుగు నెలల్లో 1,300 మంది రైతుల పొలల నుంచి మట్టి సేకరించి పరీక్షించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని అధిగమించి 2,518 పరీక్షలు చేయడం గమనార్హం. ఆయా ఫలితాలను సకాలంలో వెల్లడించి ఏ పంటలు వేయాలి, ఏ మేర ఎరువులు వాడాలి తదితర అంశాలను వివరించారు. జహీరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమ్లం సమస్య ఎక్కువగా ఉందని గుర్తించి నివారణ చర్యలు తెలిపారు. కేంద్రానికి తీసుకొచ్చిన నమూనాలను సైతం పరీక్షించి ఫలితాలను తెలియజేశారు.


ఫలితాలను విశ్లేషించి..

ల్యాబ్‌లో నమూనాను పరీక్షిస్తున్న నిపుణుడు

జాతీయ వ్యవసాయ పరిశోధన  సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలతో ఓ జోనల్‌ను ఏర్పాటుచేశారు. ప్రతి ఏటా దీని స్థాయిలో సమావేశం నిర్వహించి ప్రగతిని నివేదిస్తుంటారు. ఈ సారి తాజాగా రాజమండ్రిలోని జాతీయ పోగాకు పరిశోధనా సంస్థ కేంద్రంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లోని 72 కేవీకేల పరిధిలో చేపట్టిన అన్ని కార్యక్రమాలను పరిశీలించి భూసార పరీక్షల్లో జహీరాబాద్‌ కేంద్రానికి మూడో బహుమతి ప్రకటించడం గమనార్హం. ఈ విషయమై భూసార పరీక్షల నిపుణుడు స్వామియాదవ్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించామని, పంటల సాగు తదితర వాటిని వివరించామని తద్వారా అవార్డు సాధ్యమైందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని