logo

ఉద్యోగాల పేరిట దర్జాగా మోసం

వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ మోసగాడు.. దర్జాగా అమాయకులను నట్టేట ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.

Updated : 03 Jul 2024 05:59 IST

వివరాలు వెల్లడిస్తున్న అదనపు డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ మధు, వన్‌టౌన్‌ సీఐ లక్ష్మీబాబు, ఎస్‌ఐ నర్సింహారావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ మోసగాడు.. దర్జాగా అమాయకులను నట్టేట ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. సిద్దిపేట వన్‌టౌన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా సంబంధిత వివరాలను అదనపు డీసీపీ మల్లారెడ్డి.. ఏసీపీ మధు, వన్‌టౌన్‌ సీఐ లక్ష్మీబాబు, ఎస్‌ఐ నర్సింహారావుతో కలిసి మంగళవారం వెల్లడించారు. సిద్దిపేట శంకర్‌నగర్‌కు చెందిన వరప్రసాద్, గాంధీనగర్‌కు చెందిన బక్కోళ్ల అశోక్‌ మిత్రులు. వీరి వయసు 40 ఏళ్లపైమాటే. అశోక్‌కు బావ వరుసయ్యే దుబ్బాక మండలం తిమ్మాపూర్‌కు చెందిన జోరవంతల సత్యనారాయణ (50) హైదరాబాద్‌లోని పాత అల్వాలలో నివసిస్తున్నాడు. సిద్దిపేటలోని సీతారాంనగర్‌ కాలనీలో ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో 2022లో కార్యాలయం తెరిచాడు. ఎన్జీవో సంస్థలైన యాంటీ కరప్షన్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ సహా తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘంలో వివిధ హోదాల్లో పని చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అందరికి నమ్మబలికాడు.

సత్యనారాయణ నిందితుడు

సబార్డినేట్‌ ఉద్యోగాలంటూ..

వరప్రసాద్, అశోక్‌లు అతడిని కలవగా ప్రభుత్వ శాఖల్లో సబార్డినేట్‌ ఉద్యోగాలు రెండు నెలల్లో ఇప్పిస్తానని, రూ.6 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. ఆరు నెలల కిందట వరప్రసాద్‌ రూ.4.15 లక్షలు, అశోక్‌ రూ.1.50 లక్షలు విడతల వారీగా ముట్టజెప్పారు. నెలలు గడుస్తుండటంతో ఏమైందని ఆరా తీయడంతో సత్యనారాయణ సమీకృత మార్కెట్‌ సమీపంలోకి కార్యాలయాన్ని మార్చాడు. అద్దె కోసం వరప్రసాద్‌ నుంచి మరో రూ.15 వేలు వసూలు చేశాడు. ప్రభుత్వం మారిందని, ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయని, తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని కాలం వెళ్లదీశాడు. ఓసారి అశోక్‌కు చెల్లని చెక్కు ఇచ్చాడు. బాధితులు సొమ్ము ఇచ్చేయాలని నిలదీయగా చంపేస్తానని బెదిరించాడు. చివరకు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అసలు గుట్టు విప్పారు. పని పాట లేకుండా తిరిగే సదరు నిందితుడు హోంగార్డు, ఓ టీవీ ఛానెల్‌ ప్రతినిధి, వివిధ సంస్థల్లో పని చేస్తున్నట్లు పొంతన లేని సమాధానం చెప్పగా పోలీసులు తమదైన శైలిలో విచారించారు. సులువుగా సొమ్ము సంపాదించేందుకు మోసాలకు ఒడిగట్టాడని, నకిలీ గుర్తింపుకార్డులు సృష్టించినట్లు గుర్తించారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మోసపోయిన జాబితాలో మరిందరు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇతర బాధితులు వన్‌టౌన్‌ పోలీసులు ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని