logo

పక్కాగా పర్యవేక్షణ.. అతిసారం నియంత్రణ

వర్షాకాలంలో సాధారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగమైనా, వ్యాపారస్థులైనా, కుటుంబ సభ్యులైనా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది.

Published : 03 Jul 2024 02:20 IST

రెండు నెలల కార్యాచరణ

మద్దూరు మండలం లద్నూరులో ఓఆర్‌ఎస్‌ పొట్లాల పంపిణీ (పాతచిత్రం)

న్యూస్‌టుడే, సిద్దిపేట: వర్షాకాలంలో సాధారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగమైనా, వ్యాపారస్థులైనా, కుటుంబ సభ్యులైనా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు సంయుక్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాయి. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ముఖ్యంగా అతిసారం (డయేరియా) అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఐసీడీఎస్, విద్య, ఆర్‌డబ్ల్యూఎస్, స్థానిక సంస్థలు సమన్వయంగా ముందడుగు వేయనున్నాయి. కలుషిత నీరు, ఆహారం తీసుకుంటే అతిసారం సోకుతుంది. తద్వారా నీళ్ల విరేచనాలు జరుగుతాయి. రోజుకు ఐదారుసార్లకు మించి నీళ్ల విరేచనాలు, వాంతులు, వికారం, కడుపునొప్పి లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరం నిస్సత్తవుగా మారుతుంది. చిన్నారులకు ఇది ప్రమాదకరంగా మారుతుంది. రాబోయే రెండు నెలలు సంబంధిత శాఖలు సమన్వయంగా ముందడుగు వేయనున్నాయి. క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయడం ద్వారా అడ్డుకట్ట వేయడం సాధ్యమవనుంది.

ఆరు నెలల్లో 3,643 కేసులు

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 3,634 డయేరియా కేసులు నమోదయ్యాయి. వర్షాకాలంలో ముందు జాగ్రత్తలతో వ్యాధికి అడ్డుకట్ట వేయొచ్చు. ఈ తరుణంలో ‘స్టాప్‌ డయేరియా’ కార్యక్రమాన్ని ఆగస్టు చివరి వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆశాలు, ఏఎన్‌ఎంలు, ఇతర వైద్యారోగ్య, పారిశుద్ధ్య, తాగునీటి విభాగం సిబ్బంది కీలక పాత్ర పోషించనున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చన్నారు. శుద్ధి చేసిన నీరు సక్రమంగా సరఫరా చేసేలా పర్యవేక్షణ చేయనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తల్లులు, బాలింతలు, బాలలకు శుభ్రతపై వివరించనున్నారు. పాఠశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఓఆర్‌ఎస్‌ పొట్లాలు, జింకు మాత్రలు పంపిణీ చేయనున్నారు.

పకడ్బందీగా చేపడితేనే..

గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన, నిధుల లేమి  సమస్యలతో పారిశుద్ధ్యం లోపిస్తోంది. పకడ్బందీగా చేపడితేనే అడ్డుకట్ట పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. క్షేత్రస్థాయిలో వివిధ శాఖల సమన్వయంతో డయేరియా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.’ అని తెలిపారు.

జాగ్రత్తలు ఇలా..

  • వేడి పదార్థాలు, తాజా ఆహారం తీసుకోవాలి.
  • ఇంట్లో శుభ్రత పాటించాలి. పరిసరాల పరిశుభ్రత అవశ్యం.
  • బయటి చిరుతిళ్లు తినొద్దు.
  • పరిస్థితులకు అనుగుణంగా కాచి వడబోసిన నీటిని తాగాలి. ః ఆహారంపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి.
  • ఆరు నెలల్లోపు చిన్నారులకు తల్లి పాలు మాత్రమే పట్టించాలి.
  • రోటా వైరస్‌ వ్యాక్సిన్‌తో ప్రమాదకర అతిసార వ్యాధిని నివారించవచ్చు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని