logo

వన మహోత్సవానికి సిద్ధం

జిల్లాలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఊరూరా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధమయ్యాయి.

Published : 03 Jul 2024 02:17 IST

శాఖల వారీగా లక్ష్యం ఖరారు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

మొక్కలు నాటడానికి గుంతలు తవ్వుతున్న ఉపాధి కూలీలు

జిల్లాలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఊరూరా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఉపాధి హామీ పథకం కూలీలతో గుంతలు తవ్విస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అమీన్‌పూర్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేలా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

639 నర్సరీల్లో మొక్కలు

జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో 639 నర్సరీలు ఏర్పాటు చేశారు. వీటిలో 38 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 33 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించారు. ఒక్కో గ్రామంలో 2700 మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రహదారుల వెంట, ప్రాజెక్టులు, జల వనరులకు సమీపంలో, పొలాల గట్లపై నాటనున్నారు. ఆసుపత్రులు, పోలీసు స్టేషన్లు, అడవులు, పురపాలక స్థలాల్లోనూ నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్విస్తున్నారు. ఒక్కో మొక్క నాటడం, సంరక్షణకు రూ.34 చొప్పున జిల్లాలో మొత్తం రూ.3 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు.

8 లక్షల గుంతలు తవ్వారు

జూన్‌ ఆరంభం నుంచి వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటడానికి ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్విస్తున్నారు. ఇప్పటికే పల్లెలు, పట్టణాల్లో ఎనిమిది లక్షల గుంతలను సిద్ధం చేశారు. 20 రకాల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో మర్రి, రావి, గన్నేరు, జామ, మామిడి, అల్లనేరడు, చింత తదితర రకాలున్నాయి.

అమీన్‌పూర్‌కు రానున్న ముఖ్యమంత్రి

వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమీన్‌పూర్‌ మండలం బీరంగూడ-కిష్టారెడ్డిపేట శివారులో 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ పది ఎకరాల్లో 20 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ వెనుక ఉన్న ఆక్సిజన్‌ పార్కు తరహాలో మార్చాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది.


అన్ని వర్గాల సహకారంతో నాటనున్నాం

జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నాం. వాటిని సంరక్షించేలా ఏర్పాట్లు చేస్తాం. అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలి. అన్ని వర్గాల సహకారంతో జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

మణికుమార్, జిల్లా ప్లాంటేషన్‌ మేనేజర్‌.అడ్డంకుల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని