logo

ఎస్జీటీ.. ఆశలు ఆవిరి!

ఆరేళ్ల తరవాత ఉపాధ్యాయ బదిలీలయ్యాయి. పనిచేస్తున్న స్థానం నుంచి మరో బడికి వెళుతున్నామన్న ఆనందం ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక్క రోజైనా లేకుండా పోయింది. రేషనలైజేషన్‌కు బదిలీల ప్రక్రియతో ముడిపెట్టారు. దీంతో బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారు రాకుంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది.

Published : 03 Jul 2024 02:15 IST

బదిలీ అయినా రిలీవ్‌ చేయని వైనం
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

డీఈవో కార్యాలయంలో ఉపాధ్యాయులు

ఆరేళ్ల తరవాత ఉపాధ్యాయ బదిలీలయ్యాయి. పనిచేస్తున్న స్థానం నుంచి మరో బడికి వెళుతున్నామన్న ఆనందం ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక్క రోజైనా లేకుండా పోయింది. రేషనలైజేషన్‌కు బదిలీల ప్రక్రియతో ముడిపెట్టారు. దీంతో బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారు రాకుంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది.

300 మంది పాత చోటే..

జిల్లాలో జూన్‌ 30న ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే 1,433 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులిచ్చారు. జులై 1న వీరు కొత్త పాఠశాలల్లో చేరాలి. 2021లో విడుదలైన రేషనలైజేషన్‌ జీవో 25 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 10లోపు విద్యార్థులుంటే ఒకరు, 20లోపు అయిదే ఇద్దరు, 30 దాటితే ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేయాలి. విద్యార్థులుండి ఉపాధ్యాయులు బదిలీల్లో రాకుంటే పాత వారిని రిలీవ్‌ చేయవద్దని ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాలో దాదాపు 300 మందిని విద్యాశాఖ వారి బడుల నుంచి రిలీవ్‌ చేయలేదు. ఈ పరిస్థితి జిల్లాలోని కంగ్టి, కల్హేర్, నాగల్‌గిద్ద, సిర్గాపూర్, నారాయణఖేడ్, మనూరు, న్యాల్‌కల్, రాయికోడ్, హత్నూర, వట్‌పల్లి మండలాల్లో ఎక్కువగా ఉంది. ఉపాధ్యాయులు ఎక్కువుంటే సీనియర్‌ను తప్పనిసరిగా బదిలీ కోసం విడుదల చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. రేషనలైజేషన్‌ సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులుంటే బదిలీ అయిన వారిని రిలీవ్‌ చేయాలి. ఉపాధ్యాయులు తక్కువుంటే చేయవద్దు. డీఎస్సీ నిర్వహించి కొత్త వారు వచ్చే వరకు పాత స్థానాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది.

ఒకే గ్రామం పేర్లతో ఇబ్బంది..

జిల్లాలో చాలా చోట్ల గ్రామం పేరు ఒకటే ఉండడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పుల్కల్, రాయికోడ్‌ మండలాల్లో కోడూరు గ్రామం ఉంది. ఎస్జీటీ ఉపాధ్యాయులు అంతర్జాలంలో పాఠశాలను ఎంచుకునే సమయంలో 20 వరకు చూపుతుంది. పుల్కల్‌ మండలం కోడూరు ఎంచుకుంటే రాయికోడ్‌ మండలంలోని గ్రామానికి బదిలీ ఉత్తర్వు వచ్చింది. సంగారెడ్డి నుంచి పుల్కల్‌ మండలంలోని కోడూరు 20 కి.మీ. ఉంటే, రాయికోడ్‌ మండలంలోని కోడూరు 75 కి.మీ. దూరంలో ఉంది. జహీరాబాద్‌ నుంచి మిర్జాపూర్‌(బి) 15 కి.మీ., మిర్జాపూర్‌(ఎన్‌) 30 కి.మీ. దూరం ఉంది.

నిబంధనలకు లోబడే బదిలీలు

వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి

జిల్లాలో నిబంధనలకు లోబడే ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలయ్యాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బదిలీపై వస్తేనే ఇక్కడి ఉపాధ్యాయులకు వేరే పాఠశాలకు రిలీవ్‌ చేస్తారు. బదిలీ సమయంలో పాఠశాలల పేర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. బదిలీ ఉత్తర్వు అందుకున్న వారు తప్పనిసరిగా విధుల్లో చేరాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని