logo

అడ్డంకుల అధిగమనం.. ఏదీ ప్రారంభోత్సవం?

కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌ కొత్త భవనాన్ని ప్రారంభించడానికి గ్రహణం పట్టినట్టుగా వాయిదా పడుతూనే ఉంది. పనులు మొదలు పెట్టినప్పటినుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి.

Published : 03 Jul 2024 02:13 IST

కొమురవెల్లిలో కొత్తగా నిర్మించిన ఠాణా భవనం

న్యూస్‌టుడే, చేర్యాల: కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌ కొత్త భవనాన్ని ప్రారంభించడానికి గ్రహణం పట్టినట్టుగా వాయిదా పడుతూనే ఉంది. పనులు మొదలు పెట్టినప్పటినుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. మల్లన్న కొలువైన కొమురవెల్లికి ఏటా పాతిక లక్షలకు పైగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. 2016లో పోలీసు స్టేషన్‌ను ఇక్కడ ఆలయం అతిథి గృహంలో కొనసాగిస్తున్నారు. జాతర సమయంలో మూడు నెలల పాటు వివిధ స్టేషన్ల నుంచి 250 మందికి పైగా పోలీసులు ఇక్కడే ఉండి బందోబస్తులో ఉంటారు. సరైన వసతి లేక ఇబ్బందులు పడుతుంటారు.

గుత్తేదారును మార్చి పూర్తి: రూ.కోటితో ఠాణా నిర్మాణానికి 2018లో ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఆరు నెలల్లో గుత్తేదారు మొదటి అంతస్తు వరకు నిర్మించారు. బిల్లు రాకపోవడంతో మధ్యలో పనులు ఆపేశారు. రెండున్నరేళ్ల పాటు ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత మరో గుత్తేదారుతో పూర్తి చేయించారు. మంత్రితో భవనాన్ని ప్రారంభించాలనుకున్నా వాయిదా పడింది. ఈ కొత్త భవనంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మృతి చెందడంతో గత డిసెంబరులో శాంతి పూజలు చేయించారు. ఆరు నెలలైనా ప్రారంభానికి నోచుకోలేదు.

భక్తులకు ‘అతిథి’ దూరం: ఎనిమిదేళ్ల క్రితం వేములవాడ దేవస్థానం నిధులతో రూ.25 లక్షలు ఖర్చు చేసి అతిథిగృహ భవనాన్ని నిర్మించారు. భక్తులకు అందుబాటులో ఉండే ఈ భవనం ప్రస్తుతం ఠాణాగా మారడంతో సౌకర్యం దూరమైంది. మండల పరిషత్తు కార్యాలయమూ మరో అతిథి భవనాన్ని ఆక్రమించింది. అవసరమైన సామగ్రి రాగానే కొత్త భవనంలోకి పోలీస్‌ స్టేషన్‌ను తరలిస్తామని చేర్యాల సీఐ ఎల్‌.శ్రీను తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని