logo

ఆదాయం అందిస్తున్నా అద్దెల్లోనే..

ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. హుస్నాబాద్‌లో ఆబ్కారీ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నలభై ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

Published : 03 Jul 2024 01:53 IST

హుస్నాబాద్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌: ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. హుస్నాబాద్‌లో ఆబ్కారీ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నలభై ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. శాశ్వత ప్రభుత్వ భవనాల  నిర్మాణాలు చేపట్టడానికి ప్రత్యేక చొరవ కరవైంది. సిబ్బందికి, ప్రజలకు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హుస్నాబాద్‌లో ఇటీవల రూ.17 కోట్లతో నిర్మించి ఏడాది క్రితం ప్రారంభించిన సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈ కార్యాలయాలకు స్థానం దక్కలేదు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలకు సంబంధించి హుస్నాబాద్‌లో ఉన్న సబ్‌ రిజిష్ట్రారు కార్యాలయం స్థానిక బాలాజీ నగర్‌లో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. కార్యాలయం ఉన్న వీధిలో కనీసం ఒక వాహనమైనా పార్కింగ్‌ చేసుకోవడానికి అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా రూ.7 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుంది. పురపాలక సంఘానికి దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నూతన భవనం నిర్మించారు. త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఉన్న పుర కార్యాలయ భవనంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఆబ్కారీతో రూ.180 కోట్లు..: ఎక్సైజ్‌ ప్రోహిబిషన్‌ శాఖకు హుస్నాబాద్‌ సర్కిల్‌ ద్వారా ఏటా రూ.180 కోట్ల ఆదాయం లభిస్తోంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, నంగునూరు మండలాలకు కేంద్రం ఇక్కడ స్టేషన్‌ పని చేస్తుంది. నలభై ఏళ్లలో ఐదో అద్దె భవనంలోకి మారింది. స్థానిక రామవరం రోడ్‌లో కొనసాగుతోంది. 2018లో స్థలం కేటాయించి నిధులు మంజూరు చేశారు. అనువైన స్థలం కాదని నిర్మాణం అంశం పక్కన పెట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని